ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సంబరాలు నిర్వహించాలి
పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక ఘట్టమైన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది డిసెంబర్ 9వ తేదీనే అని కేటీఆర్ గుర్తుచేశారు.
నవంబర్ 29న ’దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా.. ’విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 9న 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఒక రూపం వచ్చిందని కేటీఆర్ అన్నారు. అలాంటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు.
నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే విజయ్ దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి.
పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్ ఆసుపత్రిలో, అలాగే గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. పార్టీ నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.


