breaking news
Kotak Securities
-
మార్జిన్ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి
మార్కెట్లపై ఆశావహ ధోరణి నెలకొన్న నేపథ్యంలో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్)పై ఇన్వెస్టర్లలో గణనీయంగా ఆసక్తి పెరుగుతోందని కోటక్ సెక్యూరిటీస్ చీఫ్ డిజిటల్ బిజినెస్ ఆఫీసర్ ఆశీష్ నందా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమవ్యాప్తంగా సగటున రూ.77,180 కోట్లుగా ఉన్న ఎంఎటీఎఫ్ రుణాలు ఆగస్టులో రూ.1 లక్ష కోట్ల స్థాయికి చేరడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.85,000 కోట్లుగా ఉన్న రుణాలు, ఈ ఏడాది తొలినాళ్లలో మార్కెట్ కరెక్షన్‌కి లోనైనప్పుడు రూ. 71,000 కోట్లకు తగ్గినప్పటికీ, ఆ తర్వాత మార్కెట్లతో పాటు చాలా వేగంగా పుంజుకున్నట్లు నందా వివరించారు.అయితే, చూడటానికి భారీగా అనిపిస్తున్నా, దేశీయంగా ఎంటీఎఫ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో దీని వాటా కేవలం 0.1 శాతమేనని నందా వివరించారు. అదే అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో ఇది 1.6 శాతంగా, చైనాలో 2.7 శాతంగా ఉన్నట్లు చెప్పారు. దేశీయంగా ఈ మార్కెట్ విస్తరణకు మరింతగా అవకాశాలు ఉండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. ఎంటీఎఫ్ విధానంలో షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఇన్వెస్టర్లు స్వల్ప మొత్తాన్ని మార్జిన్‌గా కడితే, బ్రోకరేజీ సంస్థలు దానికి తగ్గ నిష్పత్తిలో మిగతా మొత్తాన్ని రుణంగా సమకూరుస్తాయి. దానిపై వడ్డీ వసూలు చేస్తాయి. మరిన్ని ముఖ్యాంశాలు ఆశీష్ నందా మాటల్లోనే ..తక్కువ రిస్క్‌లు..రిటైల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ బ్రోకర్లు ఎంటీఎఫ్‌ను మరింత అందుబాటులోకి తేవడంతో దీనికి మరింత ప్రాచుర్యం పెరిగింది. అలాగే, వడ్డీ రేట్ల విషయంలోనూ పోటీ పెరిగింది. కొన్ని బ్రోకింగ్ సంస్థలు అత్యంత తక్కువగా 9.5 శాతం–9.75 శాతం శ్రేణిలో కూడా వడ్డీ రేటుకు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. డెరివేటివ్స్‌లో లభించే మార్జిన్ ఫెసిలిటీతో పోలిస్తే స్టాక్స్‌కి సంబంధించిన ఎంటీఎఫ్లో రిస్క్‌లు కాస్త తక్కువ ఉంటాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఇది 5–50 రెట్ల వరకు లభిస్తే, స్టాక్స్ విషయంలో లీవరేజీ 2–4 రెట్లు మాత్రమే ఉంటుంది. పైగా స్ట్రయిక్ ప్రైస్, ఎక్స్పైరీ డేట్‌తో ముగిసిపోయే సంక్లిష్టమైన ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులతో పోలిస్తే షేర్లు మన చేతిలో ఉండటం కాస్త భరోసానిచ్చే విషయంగా ఉంటుంది.1,200 స్టాక్స్‌కి మాత్రమే అందుబాటులో..సుమారు 6,500 పైగా లిస్టెడ్ స్టాక్స్ ఉన్నప్పటికీ 1,200 షేర్లకు మాత్రమే ఎంటీఎఫ్ వెసులుబాటు ఉంది. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే చాలా మటుకు స్టాక్స్‌కి ఈ సదుపాయం ఉండదు. షేరు రేట్లను బట్టి మార్జిన్ అవసరాలనేవి మారిపోతుంటాయి. రిస్కు చేసి ఎక్కువ మార్జిన్ తీసుకుందామనుకున్నా, నియంత్రణ సంస్థ నిర్దిష్ట పరిమితులు విధించడం వల్ల బ్రోకర్లు కూడా ఒక స్థాయికి మించి రుణం ఇవ్వడానికి కుదరదు. టీసీఎస్, టాటా మోటర్స్, రిలయన్స్, జియోలాంటి కొన్ని స్టాక్స్‌లో తప్ప టాప్ స్టాక్స్‌లో కూడా లీవరేజీ తక్కువగానే ఉంటోంది కాబట్టి ప్రస్తుతానికైతే దీనివల్ల వ్యవస్థాగతమైన రిసు్కలేమీ లేవు. ఈ నేపథ్యంలో ఎంటీఎఫ్కి దేశీయంగా క్యాపిటల్ మార్కెట్ వ్యవస్థకు మూలస్తంభంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు దీన్ని గురించి కూలంకషంగా తెలుసుకుని, రిసు్కల గురించి స్పష్టంగా అర్థం చేసుకుని, క్రమశిక్షణతో ఉపయోగించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన -
‘కార్వీ’ ఉదంతంతో కన్సాలిడేషన్ వేగవంతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ ఉదంతంతో బ్రోకింగ్ పరిశ్రమలో కన్సాలిడేషన్ మరింత వేగవంతమయ్యే అవకాశముందని కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం హెడ్) రష్మిక్ ఓఝా అంచనా వేశారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో క్లయింట్స్.. క్రమంగా చిన్న సంస్థల నుంచి పటిష్టమైన, పెద్ద సంస్థల వైపు మళ్లే అవకాశాలున్నాయని మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. క్లయింట్ల సెక్యూరిటీలను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వచ్చే ఏడాది ఆఖరు నాటికి నిఫ్టీ 13,400 పాయింట్లు, సెన్సెక్స్ 45,500 పాయింట్లకు చేరవచ్చని కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నట్లు ఓఝా చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు నిరాశావహంగా కనిపిస్తున్నప్పటికీ.. మార్కెట్ మాత్రం సానుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల రాకతో పాటు దేశీయంగా సిప్ రూపంలో పెట్టుబడులు వస్తుండటం మార్కెట్లకు దోహదపడుతోందని ఓఝా తెలిపారు. మార్కెట్లు, ఎకానమీ మధ్య వైరుధ్యాలు మరికొంత కాలం కొనసాగవచ్చని, బడ్జెట్లో తాయిలాలపై ఆశలతో మార్కెట్లు అధిక స్థాయిలోనే ఉండవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ వంటి అంశాలు వచ్చే ఏడాది కీలకంగా ఉండగలవని చెప్పారు. మందగమనం, ఆదాయాల్లో పెద్దగా మార్పులు లేకపోవడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత మొదలైనవి దేశీ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఓఝా చెప్పారు. ఆకర్షణీయంగా ఈ రంగాలు.. కార్పొరేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (పటిష్టమైన మాతృసంస్థల మద్దతున్నవి), ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ, హెల్త్‌కేర్, అగ్రోకెమికల్స్ రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని ఓఝా పేర్కొన్నారు. సిమెంటు, ఫార్మా రంగాల్లో మిడ్ క్యాప్ కంపెనీలు కూడా పరిశీలించవచ్చని తెలిపారు. -
కొటక్‌తో సిండికేట్ బ్యాంక్ జట్టు
ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ఆన్లైన్ ట్రేడింగ్ సేవలందించేందుకు కొటక్ సెక్యూరిటీస్తో జతకట్టింది. ఇందులో భాగంగా సేవింగ్స్/కరెంట్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్‌ను సిండికేట్ బ్యాంక్ ఆఫర్ చేస్తే, ట్రేడింగ్ అకౌంట్‌ను కొటక్ సెక్యూరిటీస్ అందిస్తుంది. బ్యాంక్ ఈ 3 ఇన్ 1 ఖాతాను సిండ్ ట్రినిటీ ప్రొడక్ట్‌గా పేర్కొంది. కొత్తగా 3ఇన్1 అకౌంట్‌ను తెరవొచ్చని, లేదా పాత అకౌంట్‌కు డీమ్యాట్, ట్రేడింగ్ సేవలను జత చేసుకోవచ్చని సిండికేట్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలహైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిండికేట్ బ్యాంక్ జోనల్ హెడ్ (హైదరాబాద్) ఎస్.విజయకుమార్ సమక్షంలో బ్యాంక్ జీఎం (మార్కెటింగ్– బెంగళూరు) ఎస్.పి.శర్మ ఈ సిండ్ ట్రినిటీ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించారు. -
తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్..
ఎఫ్ అండ్ వో ముగింపు ఎఫెక్ట్ ఆయిల్ ధరల కదలికలూ కీలకమే ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: రుతుపవనాల పురోగతి, ఇరాక్ అంతర్యుద్ధం కారణంగా వేడెక్కిన ఆయిల్ ధరలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని స్టాక్ నిపుణులు అంచా వేశారు. వీటికితోడు గురువారం(26న) జూన్ నెల ఎఫ్ అండ్ వో సిరీస్ ముగియనున్నందున ప్రధాన ఇండెక్స్‌లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. జూన్ డెరివేటివ్ పొజిషన్లను ట్రేడర్లు రోల్ఓవర్ చేసుకోవడం కూడా ఇందుకు కారణంగా నిలవనుందని పేర్కొన్నారు. ఇక మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు కూడా దేశీ ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయని తెలిపారు. భారీ పొజిషన్లు వద్దు గడిచిన శుక్రవారం మార్కెట్లు రెండు వారాల కనిష్టానికి దిగివచ్చాయి. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25,105 వద్ద, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 7,511 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే వారం ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు గురవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. అత్యధిక స్థాయిలో ఒడిదుడుకులకు లోనయ్యే కౌంటర్లకు దూరంగా ఉండటమే మేలని, ఇదే విధంగా గరిష్ట స్థాయిలో ట్రేడర్లు పొజిషన్లు తీసుకోవడం సమర్థనీయం కాదని సూచించారు. ధరల పెరుగుదలకు అవకాశం ఈ వారం మార్కెట్లకు రుతుపవనాలు కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఆహారోత్పత్తి తగ్గుతుందని, ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తుందని తెలిపారు. రుతుపవనాలు ఇప్పటికే దేశంలో సగభాగం వ్యాపించినప్పటికీ 4 రోజులు ఆలస్యమైన విషయం విదితమే. దీంతో జూన్ 1-18 మధ్య సాధారణంకంటే 45% తక్కువగా వర్షాలు పడ్డాయి. వెరసి ఇకపై వీటి పురోగమనం దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుందని మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై దృష్టి ఇకపై రుతుపవనాల కదలికలతోపాటు, జూలై రెండో వారంలో వెలువడనున్న వార్షిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ దీపేన్ షా చెప్పారు. సమీప కాలానికి ఈ రెండు అంశాలే మార్కెట్లకు దిశను నిర్దేశిస్తాయని తెలిపారు. ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతోపాటు, ఇతర సంస్కరణలను ప్రకటిస్తే దేశీ మార్కెట్లు ఇతర వర్ధమాన మార్కెట్లకు మించి దూసుకెళతాయని అభిప్రాయపడ్డారు. అయితే ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగితే కరెంట్ ఖాతాలోటు, రూపాయి, ద్రవ్యోల్బణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అమెరికా గణాంకాలు... ఈ వారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. మే నెలకు వినియోగ వస్తు రంగ ఆర్డర్లు, హౌసింగ్ అమ్మకాలు, వినియోగదారుల విశ్వాస సూచీ తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. కాగా, ఇరాక్‌లో చెలరేగిన అంతర్యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 115 డాలర్లను తాకడంతో దేశీయంగా ఆందోళనలు పెరిగాయి. చమురు అవసరాలకు విదేశాలపై అధికంగా ఆధారపడటంతో దిగుమతుల బిల్లు పెరిగి దేశీ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న అంచనాలు గత వారం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ వరుసగా రెండో వారం కూడా నష్టాలతో ముగిసింది.


