బ్యాంకులు కొన్నిసార్లు పొరపాటున లేదా అనుకోకుండా ఖాతాదారుల ఖాతాల్లో భారీ నగదు జమ చేసేస్తుంటాయి. జరిగిన తప్పు తెలుసుకుని మళ్లీ.. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. స్టాక్ మార్కెట్‌లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక లోపం కారణంగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడర్ గజానన్ రాజ్‌గురు ఖాతాలోకి రూ. 40 కోట్లు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని చూసిన ట్రేడర్ కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి 20 నిమిషాల్లో ఏకంగా రూ. 2.38 కోట్ల లాభాన్ని గడించారు. ఆ తరువాత ఇందులో రూ. 54 లక్షల నష్టం వచ్చింది. ఆ తరువాత మరోసారి ట్రేడ్ చేసి.. చివరకు రూ. 1.74 కోట్ల లాభాన్ని పొందాడు.
విషయం తెలుసుకున్న.. కోటక్ సెక్యూరిటీస్, ట్రేడర్ నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా, అతడు ట్రేడ్ చేసి సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభాన్ని కూడా తీసుకుంది. దీనిపై ట్రేడర్ కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను కోర్టు కూడా రెండు సార్లు తిరస్కరించినప్పటికీ.. అతడు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండడంతో.. చివరికి బాంబే హైకోర్టు రూ.1.75 కోట్ల లాభాన్ని తన వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది.
ఇదీ చదవండి: సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!
ట్రేడర్ తన సొంత తెలివితేటలను ఉపయోగించి రిస్క్ చేశారని, అందులో వచ్చిన లాభం తనకే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే 40 కోట్ల రూపాయలు కోటక్ సెక్యూరిటీస్ తీసుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు.. ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


