బంగారం, వెండిలో కొనసాగుతున్న అమ్మకాలు
రూ.26,273 పడిపోయిన వెండి ధర
ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.2.65 లక్షలకు
బంగారం 4,241 డౌన్ రూ.1,48,104కు పరిమితం
న్యూఢిల్లీ: వెండి, బంగారంలో పెద్ద మొత్తంలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా వరుసగా రెండో రోజు ప్రీమియం లోహాలు భారీ పతనాన్ని చూశాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లో వెండి మార్చి డెలివరీ కాంట్రాక్టు కిలోకి ఏకంగా రూ.26,273 నష్టపోయింది. 9 శాతం నష్టంతో రోజులో అనుమతించిన కనిష్ట పరిమితి (10 శాతం లోయర్ సర్క్యూట్)కి సమీపంలో 2,65,652 వద్ద ముగిసింది.
క్రితం సెషన్‌లో (శుక్రవారం) వెండి కిలోకి ఏకంగా రూ.1,07,968 (27 శాతం) పడిపోయి రూ.2,91,925 వద్ద ముగియడం తెలిసిందే. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో వెండి కిలోకి రూ.1,34,241 నష్టపోయింది.
ఇది 33.6 శాతానికి సమానం. బంగారం ఏప్రిల్ నెల కాంట్రాక్టు (10 గ్రాములు) 3 శాతం నష్టంతో (రూ.4,241) రూ.1,48,104 వద్ద స్థిరపడింది. ఆరంభంలో 10 శాతం నష్టంతో రూ.1,38,634 వద్ద లోయర్ సర్క్యూట్‌ను సైతం తాకింది. ఆ తర్వాత కొంత కోలుకుంది. బంగారం సైతం అంతక్రితం సెషన్‌లో 10 గ్రాములకు రూ.31,617 (17.2 శాతం) నష్టపోయి రూ.1,52,345 వద్ద స్థిరపడడం తెలిసిందే. గత గురువారం బంగారం కాంట్రాక్టు రూ.1,93,096 పలకడం గమనార్హం.
పెరుగుట విరుగుట కొరకే..
చాలా వేగంగా బంగారం, వెండి ధరలు పెరగడం పతనానికి దారితీసిందని, బులియన్ ధరల్లో అదే చూస్తున్నామని జీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ తెలిపారు. ‘‘బంగారం 20 శాతం పతనమైంది. వెండి గరిష్టాల నుంచి 37 శాతం నష్టపోయింది. దేశీ మార్కెట్లో ఆదివారం కూడా అమ్మకాలు కొనసాగాయి’’అని వివరించారు. వాస్తవానికి అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లకు ఆదివారం సెలవు.
గత శుక్రవారం దేశీ మార్కెట్లలో కంటే అంతర్జాతీయ మార్కెట్లలో వెండి, బంగారంలో దిద్దుబాటు ఎక్కువగా నెలకొంది. దీంతో మన మార్కెట్లో ఆదివారం (బడ్జెట్ కారణంగా ట్రేడింగ్) అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ నెల డెలివరీ కాంట్రాక్టు ఔన్స్‌కు 612 డాలర్లు (11 శాతం) నష్టంతో 4,763 డాలర్లకు దిగి రావడం గమనార్హం. గురువారం దీని గరిష్ట ధర 5,626 డాలర్లు. కామెక్స్‌లో వెండి మార్చి కాంట్రాక్ట్ 35.89 డాలర్లు పడిపోయి (31 శాతం) 78.53 డాలర్లకు పరిమితమైంది.
మారిన పరిణామాలు..
యూఎస్ ఫెడ్ చైర్మన్ జిరోమ్ పావెల్ సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండదని సంకేతం ఇవ్వడంతో డాలర్ బలపడిందని, ఇది బులియన్ ధరలపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకుల అభిప్రాయం. దీనికితోడు కెవిన్ వార్‡్షను తదుపరి ఫెడ్ చైర్మన్‌గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించడం సైతం ప్రభావం చూపించినట్టు చెబుతున్నారు.
‘‘లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. దీనికితోడు నెలవారీ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ సమీపించడం అమ్మకాలకు దారితీసింది. ధరల పతనం నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లు బంగారం, వెండి కాంట్రాక్టుల మార్జిన్లను పెంచేశాయి. దీంతో ఆటుపోట్లు మరింత పెరిగాయి. వచ్చే కొన్ని సెషన్లలో మరింత దిద్దుబాటు చేసుకోవచ్చు. ఆ తర్వాతే ధరలు స్థిరపడొచ్చు’’అని అని ప్రణవ్ మీర్ తెలిపారు.


