నేను ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మంచి ఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ఏ అంశాలను చూడాలి? - కృష్ణ శర్మ
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఇవి తక్కువ వ్యయాలకే మెరుగైన రాబడుల అవకాశాలను కల్పిస్తాయి. వీటి ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్‌పెన్స్ రేషియో. ఇండెక్స్ ఫండ్ ఏ సూచీలో అయితే పెట్టుబడులు పెడుతుందో గమనించి, ఆ ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇండెక్స్‌కు, ఆ ఇండెక్స్ అనుసరించే ఫండ్స్‌కు రాబడుల్లో అతి స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ వృద్ధి అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా ఉండొచ్చు.
ముఖ్యంగా ఎక్స్‌పెన్స్ రేషియో ఎంతో కీలకమైన అంశం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్ సూచీలను అనుసరించే పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక ఎక్స్‌పెన్స్ రేషియో ఒక్కటే ఇక్కడ ప్రామాణికం అవుతుంది.
నెలవారీ సంపాదన నుంచి రిటైర్మెంట్, ఇతర జీవిత లక్ష్యాల కోసం ఏ మేరకు కేటాయించుకోవాలి. - విశేష్
మీకు నెలవారీగా వస్తున్న ఆదాయం, జీవిత లక్ష్యాలు, వాటికి ఎంత కాలవ్యవధి ఉంది? తదితర అంశాల ఆధారంగా పొదుపు, పెట్టుబడులను నిర్ణయించుకోవాలి. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని అయినా పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎంత చొప్పున విభజించాలనే దానికి ఇదమిత్థమైన సూత్రం లేదు. ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత కాలంపాటు, ఎంత రాబడి కోరుకుంటున్నారనే దాని ఆధారంగా ఈ కేటాయింపులు ఆధారపడి ఉంటాయి. ముందు కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి.
దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మెరుగైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో లేదా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల స్వల్ప కాల లక్ష్యాల కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న సమయంలో ఈక్విటీ పెట్టుబడులను కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకుని, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలో పతనాల రిస్క్‌ను అధిగమించొచ్చు.
ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్


