తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో బడ్జెట్ అప్పుల్లో బాబు సర్కారు దేశంలోనే టాప్
6 నెలల్లో రూ.63,052 కోట్ల అప్పులు
నెలకు రూ.10 వేల కోట్లకు పైగా రుణాలు.. సంపద సృష్టిలో మాత్రం తిరోగమనం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల బడ్జెట్ సూచికలను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా బడ్జెట్ అప్పులు చేసింది. మిగతా పెద్ద రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారే ఎక్కువ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల బడ్జెట్ కీలక సూచికలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం వెల్లడించింది.
దీనిప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబరు మధ్య నెలకు రూ.10 వేల కోట్లకు పైగా ఆరు నెలల్లో రూ.63,052 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఈ స్థాయిలో రుణాలు తీసుకోకపోవడం గమనార్హం. అయినా సంపద సృష్టిలో మాత్రం బాబు పాలన తిరోగమనంలో సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వైఎస్ జగన్ హయాంలో వచ్చినదాని కంటేఇప్పుడు రెవెన్యూ రాబడులు పడిపోయాయి.
» కూటమి సారథిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా ప్రతి నెల అమ్మకం పన్ను రాబడి తగ్గుతూనే ఉంది. వైఎస్ జగన్ పాలనలో వచ్చినదాని కన్నా పడిపోతోందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది ఆర్థిక వెనుకబాటే...
అమ్మకం పన్ను తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోంది అని స్పష్టం. సాధారణంగా ఏటా, ప్రతి నెలా రాబడులు పెరుగుతాయి తప్ప తగ్గడం ఉండదు. అందుకు భిన్నంగా చంద్రబాబు పాలనలో రెవెన్యూ రాబడులు తగ్గిపోతున్నాయి.
» 2023–24లో తొలి ఆరు నెలల్లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన రెవెన్యూ రాబడుల కంటే 2025–26లో బాబు హయాంలో 8.4 శాతం పడిపోయాయి. రూ.7,903.96 కోట్లు తగ్గిపోయాయి. అమ్మకం పన్ను రాబడులు రూ.517.55 కోట్లు తగ్గిపోయాయి. అంటే 5.52 శాతం క్షీణించాయి. అంటే, రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని తేటతెల్లం అవుతోంది.
అప్పుల వృద్ధి... సంపద శూన్యం
అమ్మకం పన్ను సహా అంతకు రెండేళ్ల ముందు వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా రాకుండా క్షీణించడం అంటే చంద్రబాబు అస్తవ్యస్త, అసమర్థ పాలనకు నిదర్శనం అని ఆర్థిక నిపుణులు తేల్చిచెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి.
» వైఎస్ జగన్ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వచ్చిన కేంద్ర గ్రాంట్లతో పోలిస్తే 2025–26లో 81.12 శాతం మేర తగ్గిపోయాయి. గ్రాంట్లు ఏకంగా రూ.17,255 కోట్లు తగ్గిపోయాయి.
» మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బడ్జెట్ వ్యయం సైతం తిరోగమనంలో ఉంది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబరు కన్నా 2025–26లో 3.4 శాతం తగ్గింది.
» సాధారణంగా ఏటా బడ్జెట్ వ్యయం పెరగాలి తప్ప తగ్గడం అంటే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతోందని స్పష్టం అవుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
» విజన్ డాక్యుమెంట్లు, జీఎస్‌డీపీ, సంపద సృష్టి అంటూ గొప్పలుపోతూ ఏడాదిన్నరగా బాబు చేస్తున్న పాలనకు... బడ్జెట్ రాబడులు, వ్యయాలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం.
» రాష్ట్రం పురోగమించకపోగా తిరోగమనంలోకి వెళ్తోందని బడ్జెట్ కీలక సూచికలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నప్పటికీ అవన్నీ మాటలకే పరిమితం తప్ప ఆచరణలో లేదని కాగ్ గణాంకాలే తేల్చాయి.
ఈ రంగాలకు చేసే ఖర్చు సామాజిక రంగం కిందకు వస్తుంది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబరుతో పోల్చితే 2025–26లో సామాజిక రంగ వ్యయం 11.10 శాతం తగ్గింది. అంటే వైఎస్ జగన్ పాలనలో చేసిన వ్యయం కంటే సామాజిక రంగంపై బాబు సర్కారు చేసింది చాలా తక్కువని కాగ్ గణాంకాలు నిరూపించాయి.
మూలధన వ్యయమూ అంతంతే..!
ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే బడ్జెట్‌లో రూ.63,052 కోట్లు అప్పు చేయడం ద్వారా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కన్నా బాబు సర్కారు ఎక్కువ వృద్ధి నమోదు చేసింది. అయినా, మూలధన వ్యయం అంతంతమాత్రంగానే ఉంది.
2023–24 ఏప్రిల్–సెప్టెంబరు మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం కన్నా 2025–26లో బాబు సర్కారు చేసిన మూలధన వ్యయం 29.38 శాతం తక్కువ కావడం గమనార్హం. ఇన్ని అప్పులు చేసినా బాబు సర్కారు మూలధన వ్యయం కేవలం రూ.11,715.09 కోట్లే అని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి.
‘అప్పు’డంతా ప్రగల్భాలే.. ఇప్పుడంతా లోటే..!
చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయాలంటూ ఎన్నికలకు ముందు బాబు పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. రెవెన్యూ లోటును రూ.33,185 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్‌లో పేర్కొంది చంద్రబాబు సర్కారు.
కానీ, ఆర్థిక సంవత్సరం ఇంకో ఆరు నెలలు ఉండగానే అంతకుమించి రెవెన్యూ లోటులోకి తీసుకెళ్లింది. ఇప్పటికే రెవెన్యూ లోటు రూ.46,652.41 కోట్లకు చేరింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబరు మధ్య వచ్చిన రెవెన్యూ రాబడులు రాకుండా తగ్గిపోవడంతోపాటు బడ్జెట్ వ్యయమూ తగ్గిపోయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.



