ఐదున్నరేళ్లలో పీఎస్‌బీలు చేసిన పని
లోక్‌సభకు వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో రూ.6.15 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి. ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనిపై లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ఆర్‌బీఐ డేటా ప్రకారం.. గత ఐదు ఆర్థిక సంవత్సరాలతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్ 30 వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,15,647 కోట్ల మేర రుణాలను మాఫీ చేశాయి’’అని వెల్లడించారు.
వసూలు కాని మొండి రుణాలను (ఎన్‌పీఏలు) బ్యాంక్‌లు నిబంధనల మేరకు మాఫీ చేస్తాయని వివరించారు. అయినప్పటికీ అలా మాఫీ చేసిన రుణాల వసూలుకు అవి చర్యలు కొనసాగిస్తాయని చెప్పారు. ఆదాయపన్ను చట్టం, 2025 కింద కొత్త పన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్) 2027–28 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫై చేయనున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభకు వెల్లడించారు.


