
2024లో 11 పీఎస్‌బీలకు భారీ ఆదాయం
రూ. 2,331 కోట్ల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ
ఖాతాదారులకు ఇన్నాళ్లకు లభించిన ఊరట
అకౌంట్లో కనీస బ్యాలెన్స్ పెనాల్టీ తొలగింపు
లిస్టులో పీఎన్ బీ, బీవోబీ సహా 5 బ్యాంకులు
మినిమం బ్యాలెన్స్ నిబంధన.. బ్యాంకు ఖాతా నుంచి ఆఖరు రూపాయి కూడా ఊడ్చేసినా ఖర్చులు తీరని సామాన్యులకు, వేతన జీవులకు కంగారెత్తిస్తుంది. చెప్పిన దానికన్నా ఖాతాలో ఏ కాస్త తక్కువైనా సరే బ్యాంకులు పెనాల్టీ చార్జీల కింద బాదేస్తుంటాయి. అప్పటికి కట్టలేకపోతే, ఆ తర్వాత ఖాతాలోకి డబ్బు క్రెడిట్ కావడమే తరువాయి.. లాగేస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు సరే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా దీన్ని అడ్డం పెట్టుకుని వందల వేల కోట్ల రూపాయలు రాబట్టాయి.
దీనిమీద చాలాకాలంగా విమర్శలు వస్తున్నా, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు మనసు, రూటు మార్చుకుంటున్నాయి. ఎస్‌బీఐ కోవలో మరో 5 బ్యాంకులు ఈ ‘మినిమం’ నిబంధనను ఎత్తివేసి, మ్యాగ్జిమం ఊరటనిచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఒక్కో ఖాతాదారువారీగా చూస్తే పెనాల్టీలు నామమాత్రంగా వందల రూపాయల స్థాయిలోనే కనిపిస్తాయి. కానీ, కోట్ల మంది పరంగా చూస్తే వేల కోట్ల రూపాయలు బ్యాంకులు వసూలు చేశాయి. ఆర్థిక శాఖ గతేడాది ఇచ్చిన గణాంకాల ప్రకారం మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలా వసూలు చేసింది ఏకంగా రూ.5,614 కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో 11 పీఎస్‌యూ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2,331 కోట్లు మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల కింద వసూలు చేశాయి.
2023లో వసూలు చేసిన రూ.1,855 కోట్లతో పోలిస్తే ఇది 25.6 శాతం అధికం! చాలా మటుకు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని అల్పాదాయ కస్టమర్లు ఏటా రూ.360–720 వరకు, పట్టణ ప్రాంతాల్లోని వారు ఏటా కనీసం రూ. వెయ్యి అయినా చెల్లించుకోవాల్సి వస్తోందని అంచనా.
ఇంతకీ ఎందుకీ చార్జీలు?
2000కు ముందు ఈ నిబంధనను పెద్దగా పట్టించుకోకపోయినా, ఆ తర్వాత పెద్ద ప్రైవేట్ బ్యాంకులు వచ్చినప్పట్నుంచి ఇవి సర్వసాధారణమైపోయాయి. అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చార్జీలను రద్దు చేసినప్పటికీ 2017లో మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో కోట్లాది ఖాతాదారుల మీద ప్రభావం పడి చర్చకు దారి తీసింది. దీంతో కాస్త తగ్గించి, ఆ తర్వాత 2020లో కోవిడ్ సమయంలో పూర్తిగా తొలగించింది. వాస్తవానికి కస్టమర్ల ఖాతాల (సేవింగ్స్ అయినా, కరెంట్ అయినా) నిర్వహణ కోసం బ్యాంకులకు కాస్తంత ఖర్చవుతుంది.
అంటే ఏటీఎం విత్‌డ్రాయల్స్, కార్డుల నిర్వహణ, పాస్‌బుక్ ప్రింటింగ్, బ్రాంచ్ సర్వీసులు, ఆన్ లైన్/మొబైల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు మొదలైనవి కల్పించడానికి ఖర్చులవుతాయి. కస్టమర్లు కనీసం కొంతైనా బ్యాలెన్స్ ఉంచితే ఆ ఖర్చులను కవర్ చేసుకోవచ్చనేది బ్యాంకుల ఆలోచన. అదొక్కటే కాదు..
» ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుకే డిపాజిట్లను సమీకరించుకున్నట్లు అవుతుంది. అలా చౌకగా వచ్చిన మొత్తాన్ని అధిక వడ్డీ రేటుపై రుణాలివ్వొచ్చు లేదా పెట్టుబడులకు వాడుకోవచ్చు.
» పెనాల్టీలనేవి బ్యాంకులకు ఇతరత్రా ఆదాయ వనరులాగా కూడా ఉపయోగపడతాయి.
» బ్యాలెన్స్ లేని ఖాతాల వల్ల తమకు ఉపయోగం లేకపోయినా తప్పనిసరిగా కేవైసీ, ఆడిట్‌లాంటివన్నీ చేయాలి. కాబట్టి ఆ భారాన్ని తగ్గించుకునేందుకు పెనాల్టీలు విధిస్తే కస్టమర్లు ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవడమో లేదా మూసివేయడమో చేస్తారు కాబట్టి భారం కాస్త తగ్గుతుంది.
» హై–వేల్యూ కస్టమర్లు, లో–వేల్యూ కస్టమర్లను గుర్తించేందుకు, ఖాతాదారులను బట్టి ప్రీమియం సర్వీసుల్లాంటివి ఆఫర్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.
ఎందుకు తొలగిస్తున్నాయంటే?
కరువు.. ఆపై అధిక మాసంలాగా అసలే చేతిలో డబ్బు లేకపోగా.. పెనాల్టీల భారం కూడా తోడు కావడమనేది సామాన్య ఖాతాదారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది. దీన్ని భరించే బదులు ఖాతానే వాడటం మానేస్తే పోతుందని వదిలేస్తున్నారు కూడా. దీన్ని పరిష్కరించుకోవడంతో పాటు, అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుండటంతో దానికి తగ్గట్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే తీసుకున్న ఈ నిర్ణయంతో.. సాధారణంగా కనీస బ్యాలెన్స్లను పాటించడం కష్టంగా ఉండే విద్యార్థులు, రైతులు, మహిళలు, గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లోని పేదలు మొదలైన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది.
వ్యాపార వ్యూహాలు..: ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంలో బ్యాంకుల వ్యాపా ర వ్యూహాలు కూడా ఉన్నాయి. పెనాల్టీల రూపంలో కోట్లు వసూలు చేస్తున్నప్పటికీ బ్యాంకుల కోణంలో చూస్తే వాటికి వచ్చే వడ్డీ ఆదాయంతో పోలిస్తే ఇలా వచ్చే ఆదాయం చాలా తక్కువే. దీనికి తోడు చెడ్డ పేరు ఒకటి. దీంతో ఆ కాస్త మొత్తాన్ని వదులుకున్నా, కస్టమర్ల నమ్మకాన్ని పొందవచ్చనేది ఒక ఆలోచన.
మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ భారం లేదు కాబట్టి ఖాతాదారులు ఎంతో కొంతైనా వేస్తూ, తీస్తూ ఉండటం వల్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉంటాయి. అలాగే పాతబడిన ఖాతాలపై పెనాల్టీలు వేయొద్దన్న నియంత్రణ సంస్థ ఆదేశాలను కూడా పాటించినట్లవుతుంది. జీరో–బ్యాలెన్స్, డిజిటల్ ఖాతాల్లాంటివి అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న కొత్త తరం సంస్థలతో పోటీపడేందుకు వీలవుతుంది.
ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.633.4 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.386.51 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.369.16 కోట్లు ఇలా పెనాల్టీల కింద వసూలు చేశాయి.