
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిపై వెనక్కి తగ్గింది. కొత్త పొదుపు ఖాతాలకు పెంచిన కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన కనీస సగటు బ్యాలెన్స్ను రూ.50 వేల నుంచి రూ.15 వేలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో ఇటీవలె మార్పులు తీసుకొచ్చింది. బ్యాంక్ ఇదివరకు సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.
అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎంఏబీని అత్యంత భారీగా పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్ జే కోటక్ తన ఎక్స్ ఖాతాలో చెప్పారు. దీనిపై ఆర్బీఐ కూడా స్పందించింది. ఎంఏబీని నిర్ణయించుకోవడం పూర్తిగా బ్యాంకుల ఇష్టమంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.