
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బాటలోకే వచ్చేసింది. తమ బ్యాంకులో పొదుపు ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో లేదా పట్టణ శాఖలో కొత్త పొదుపు ఖాతాను తెరిచే ఎవరైనా రూ .25,000 కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించాల్సి ఉంటుంది. ఇది మునుపటి అవసరం రూ .10,000 కంటే రెట్టింపు.
ఈ మార్పు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. అయితే ఈ కొత్త ఎంఏబీ నిబంధన కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇప్పటికే పొదుపు ఖాతా ఉన్న కస్టమర్లకు ఇప్పటివరకూ ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. ఏదేమైనా ఆగస్టు నుంచి ఖాతాలు తెరిచే వారు అవసరమైన బ్యాంక్ బ్యాలెన్స్‌ను నిర్వహించకపోతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.
కొత్త నిబంధనలు
అప్డేట్ చేసిన నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు స్థిరంగా రూ .25,000 బ్యాలెన్స్ నిర్వహించాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ ఈ పరిమితి కంటే తక్కువగా ఉంటే బ్యాంకు జరిమానా విధిస్తుంది. పట్టణ, మెట్రో శాఖలకు లోటులో 6 శాతం లేదా రూ.600లో ఏది తక్కువైతే అది జరిమానాగా లెక్కిస్తారు. ఈ సవరణకు ముందు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎంఏబీ అవసరాలు పట్టణ శాఖలకు రూ.10 వేలు, సెమీ అర్బన్ బ్రాంచ్ లకు రూ.5,000 (నెలవారీ సగటు ), గ్రామీణ శాఖలకు రూ.2,500 (త్రైమాసిక సగటు)గా ఉండేది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈ పరిమితులు మారలేదు. తాజా సవరణ ప్రత్యేకంగా మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని కొత్త ఖాతాలకు వర్తిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ మరీ భారీగా..
ఓ వైపు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను రద్దు చేస్తుంటే.. ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఇప్పటికీ ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మరింత దూకుడుగా మెట్రో, పట్టణ శాఖలలో కొత్త పొదుపు ఖాతాలకు ఎంఏబీని ఏకంగా రూ .50,000 కు పెంచేసింది. ఇది కూడా ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తుంది.
కాగా విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీఐసీఐ బ్యాంక్ దిగివచ్చింది. కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) అవసరాన్ని రూ.15 వేలకు తగ్గించింది. మరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా అదే బాటలో తన నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.