
లక్షలాది లోన్ కస్టమర్లకు ఊరట కల్పిస్తూ.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంపీఎల్ఆర్) ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చిన ఈ తగ్గింపు గృహ రుణాలు, కారు లోన్లు, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలను తగ్గిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి మినహా మిగతా అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్‌ను 0.05 శాతం తగ్గించింది. ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఇక ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గింది.
సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఇవే..
కాలపరిమితి | కొత్త ఎంసీఎల్ఆర్ | పాత ఎంసీఎల్ఆర్ |
---|---|---|
ఓవర్‌నైట్ | 8.55% | 8.60% |
1 నెల | 8.55% | 8.60% |
3 నెలలు | 8.60% | 8.65% |
6 నెలలు | 8.70% | 8.75% |
1 సంవత్సరం | 8.70% | 8.75% |
2 సంవత్సరాలు | 8.75% | 8.75% |
3 సంవత్సరాలు | 8.75% | 8.80% |
(మూలం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్)
ఈఎంఐలు ఎలా ప్రభావితం అవుతాయంటే..
ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకున్న రుణగ్రహీతలకు ఎంసీఎల్ఆర్ రేట్ల ద్వారా రుణ ఈఎంఐలు నేరుగా ప్రభావితమవుతాయి. ఎంసీఎల్ఆర్ తగ్గడం అంటే సాధారణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గినట్లే. ఇది ఈఎంఐలు తగ్గడానికి దారితీస్తుంది. తాజా మార్పుతో, ప్రస్తుత రుణగ్రహీతలు వారి రుణాల రీసెట్ కాలాన్ని బట్టి వారి నెలవారీ ఈఎంఐలలో స్వల్ప క్షీణతను చూడవచ్చు.