
మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.
చనిపోయినవారి బ్యాంకు ఖాతాలలో ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అప్పగించడంలో వివిధ బ్యాంకుల్లో భిన్న ప్రక్రియలను అనుసరిస్తున్నారు. దీంతో క్లయిమ్ సెటిల్మెంట్‌లో ఇబ్బందులు, తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. బ్యాంకులు అనుసరించే ఈ ప్రక్రియలలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం.
రూ .67,000 కోట్లకుపైగా అన్‌క్లెయిమ్ డిపాజిట్లు
బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జూలై 28న పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ డేటా ప్రకారం, భారతీయ బ్యాంకులు జూన్ 30, 2025 నాటికి రూ .67,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి.
క్లెయిమ్ చేయని మొత్తం డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.58,330.26 కోట్లు. ఇందులో ఎస్‌బీఐ రూ.19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.6,278.14 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,063.45 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,360.16 కోట్లు అన్‌క్లయిమ్ డిపాజిట్లు ఉన్నాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత 10 ఏళ్లపాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను డీఈఏ ఫండ్ కు బదిలీ చేస్తారు.
కాగా పాలసీ రెపో రేటును యథాతథంగా 5.5 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేటును యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.