నాన్ బ్యాకింగ్ రుణ సంస్థల వృద్ధి నిదానించొచ్చు
2025–26లో 12–13 శాతానికి పరిమితం కావొచ్చు
రేటింగ్స్ సంస్థ క్రిసిల్ అంచనా
ముంబై: గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో.. నాన్ బ్యాంకింగ్ రుణ దాతల హౌసింగ్ పోర్ట్‌ఫోలియో వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. నాన్ బ్యాంక్ రుణదాతల నిర్వహణలోని రుణ ఆస్తుల విలువ 2025–26లో 12–13 శాతం మేర వృద్ధి చెందొచ్చని.. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 14 శాతంగా ఉందని పేర్కొంది.
బ్యాంకుల నుంచి తీవ్ర పోటీకి తోడు, ప్రీమియం గృహ రుణాల్లో ఆధిపత్యం రూపంలో సవాళ్లను బ్యాంకింగేతర గృహ రుణ సంస్థలు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనూ ప్రీమియం గృహ రుణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించించినట్టు తెలిపింది. బ్యాంకులు తక్కువ రేటుపై గృహ రుణాలను అందిస్తుండడం ధరల్లో పోటీకి దారితీసినట్టు పేర్కొంది.
9 శాతంలోపు వడ్డీ రేట్లతో కూడిన గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2025 మార్చి 31 నాటికి 60 శాతానికి చేరుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 45 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. బ్యాలన్స్ ట్రాన్స్‌ఫర్ (మిగిలిన గృహ రుణాన్ని బదిలీ చేసుకోవడం)తో కస్టమర్లు వెళ్లిపోతున్న ధోరణి నెలకొన్నట్టు క్రిసిల్ డైరెక్టర్ శుభశ్రీ నారాయణన్ తెలిపారు.ప్రభుత్వరంగ బ్యాంకులు అసాధారణ స్థాయిలో అతి తక్కువ రేట్లపై గృహ రుణాలను మంజూరు చేస్తుండడం పట్ల కొన్ని సంస్థలు ఇటీవలి కాలంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
నిదానించిన వృద్ధి..
పెరుగుతున్న పట్టణీకరణ, ఇళ్ల ధరల కంటే, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, ఆదాయపన్ను, జీఎస్‌టీ తగ్గింపు వంటి సానుకులతలు ఉన్నప్పటికీ.. గృహ రుణ మార్కెట్లో వృద్ధి నిదానించినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. మొత్తం మీద 2025–26లో మోర్ట్‌గేజ్ ఏయూఎం వృద్ధి 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2024–25లో 18.5 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.


