పీఎస్‌బీలు చర్యలు చేపట్టాలి
మనకు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ముంబై: కస్టమర్లతో మరింత మమేకం అయ్యేందుకు గాను బ్యాంకు సిబ్బంది స్థానిక భాషలో మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) సూచించారు. స్థానిక భాష తెలిసిన వారినే నియమించాలన్న డిమాండ్లు ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో వినిపిస్తుండడంతో కేంద్ర మంత్రి దీనిపై స్పందించారు.
బెంగళూరులో ఇటీవల ఎస్‌బీఐ మేనేజర్ ఒకరు కన్నడ భాష తెలియక, దురుసు ప్రవర్తనతో విమర్శల పాలు కావడం తెలిసిందే. ‘‘బ్రాంచ్‌లో నియమించే ప్రతీ ఉద్యోగి తన కస్టమర్‌ను అర్థం చేసుకుని, స్థానిక భాషలో మాట్లాడే విధంగా ఉండాలి.
ముఖ్యంగా యాజమాన్యానికి స్థానిక భాష తెలియని పరిస్థితుల్లో, బ్రాంచ్ స్థాయి అధికారులు అయినా స్థానిక భాషలో మాట్లాడగలగాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఆధారంగా ఉద్యోగుల పనితీరును మదింపు వేసే విధానం ఉండాలి’’అని ఎస్‌బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి స్పష్టం చేశారు. వివిధ మాతృభాషల అధికారులను వేర్వేరు భిన్న ప్రాంతాల్లో నియమించరాదన్న విధానాన్ని మాత్రం తాను సమర్థించబోనన్నారు.
కస్టమర్లతో అనుబంధమే కీలకం
బ్యాంకు తన కార్యకలాపాల నిర్వహణకు స్థానిక కస్టమర్లు కీలకమని, బ్యాంకు వృద్ధి అవసరాల పరంగా చూసినా వారితో అనుసంధానత ఎంతో కీలకమని మంత్రి గుర్తు చేశారు. కస్టమర్లతో అనుబంధం తగ్గిపోతుండడంతో క్రెడిట్ సమాచార సంస్థలపై (సిబిల్ తదితర క్రెడిట్ బ్యూరోలు) బ్యాంకులు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నట్టు మంత్రి చెప్పారు.
ఆయా సంస్థలు తాజా సమాచారాన్ని అప్‌డేట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, దీంతో కొన్ని సందర్భాల్లో కస్టమర్లు రుణ తిరస్కరణలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు గుర్తు చేశారు. గతంలో బ్యాంక్ అధికారులకు తన కస్టమర్ల రుణ సామర్థ్యం గురించి అవగాహన ఉండేదన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.
ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను అడ్డుకోము
రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో ట్రేడింగ్ చేయకుండా ప్రభుత్వం అడ్డుకోబోదని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. కాకపోతే అందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన కల్పిస్తామని ప్రకటించారు. ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లలో ప్రతి 100 మందికి 91 మంది నష్టపోతున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడి కావడం తెలిసిందే.
పెద్ద బ్యాంక్‌లు కావాలి..
మన దేశానికి అతిపెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ, బ్యాంకులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతో కసరత్తు చేయాల్సి ఉందంటూ.. బడా బ్యాంకుల ఏర్పాటుకు ఎలా ముందుకు వెళ్లాలనే విషయమైన ఆర్‌బీఐ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ప్రకటించారు.
బ్యాంకుల విలీనం కూడా ఒక మార్గమని చెప్పారు. పరిశ్రమలకు బ్యాంకుల నుంచి రుణ వితరణ మరింత విస్తృతం కావాలన్నారు. జీఎస్‌టీ రేట్ల కోతతో డిమాండ్ పెరిగి, అది పెట్టుబడుల సైకిల్‌కు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాంకుల అంశంతోనే కేంద్ర సర్కారు 2019లో ప్రభుత్వరంగ బ్యాంకుల మెగా విలీనాన్ని చేపట్టడం తెలిసిందే. దీంతో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనాల అనంతరం 12కు తగ్గాయి. మరో విడత ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంపై కేంద్ర సర్కారు యోచిస్తున్నట్టు ఇటీవలే వార్తలు రావడం గమనార్హం. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ దిశగా చర్యలు కూడా కొనసాగుతున్నాయి.


