విద్యలేని వాడు వింత పశువు అని ఒకప్పుడు అనేవారు.. ఈ ఆధునిక కాలంలో మాత్రం ఈ సామెతను బీమా లేని వారికి వాడుకోవాలి. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన 2020 నుంచి భారత్‌లో బీమా ప్రీమియం గణనీయంగా పెరిగింది. కచ్చితంగా చెప్పాలంటే ప్రీమియం 73 శాతం వరకూ పెరగ్గా బీమా చేసిన మొత్తం కూడా 240 శాతం వరకూ ఎక్కువైంది. కానీ... ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే... ఉన్న బీమా కవరేజీ అస్సలు సరిపోవడం లేదు. ఇతర అవసరాల కోసం దాచుకున్న సొమ్ము ఖర్చుపెట్టాలి లేదంటే అప్పు చేయాలి. అందుకే... మీ బీమా పాలసీ ఏటికేడాదీ పెరిగిపోతున్న వైద్యం ఖర్చులను తట్టుకునేలా ఉందా? లేదా? సరిచూసుకోండి.
దేశంలో చాలామంది బీమా పాలసీ తీసుకున్న వారు తమకు రూ.10 - 15 లక్షల కవరేజీ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. కొంచెం ఆదాయం తక్కువగా ఉన్న వారు రూ.పది లక్షల మొత్తానికి సర్దుకుంటూంటే.. మధ్యతరగతి వారు ఇంకో ఐదు లక్షల వరకూ ఎక్కువ మొత్తంతో పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ఈ పెంపు సరిపోతుందా? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే వైద్యం ఖర్చులు ఏటా పన్నెండు నుంచి 14 శాతం వరకూ పెరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు మాత్రమే కాకుండా.. ఆసుపత్రుల్లో గదుల అద్దెలు, మందులు, ఇతర కన్స్యూమబల్స్ రేట్లు పెరిగిపోవడం ఇందుకు కారణం. గత ఐదేళ్లలో పెరిగిన ప్రీమియం మొత్తం కూడా ఈ వ్యత్యాసాన్ని తట్టుకోలేకపోతోంది. ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదని చాలామంది పాలసీదారులు అనుకుంటున్నారని, అంతకంటే వేగంగా ఆసుపత్రి బిల్లులు పెరుగుతున్నాయని గుర్తించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
టాప్ అప్‌లతో ఉపశమనం...
పెరిగిపోతున్న వైద్యం ఖర్చులకు అనుగుణంగా మీ పాలసీను మలచుకోవడం ఒక మార్గం. బేస్ ప్లాన్‌కు అనువైన టాప్‌అప్ పాలసీలు జోడించుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ వస్తుంది. కొన్ని కంపెనీలు ద్రవ్యోల్బణానికి తగ్గట్టు ఏటా బీమా మొత్తాన్ని పెంచే పాలసీలు అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లంబార్డ్‌లలో పాలసీ మొత్తం ఏటా పదిశాతం పెరిగేలా ఇన్‌ఫ్లేషన్ షీల్డ్ కవరేజీ అందిస్తున్నాయి. కుటుంబంలో ఒకొక్కరి ఒక్కో పాలసీ కాకుండా.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఎంచుకోండి. దీనివల్ల అందుబాటులో ఉండే మొత్తం ఎక్కువగా ఉంటుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు ఏ ఏ అంశాలపై కవరేజీ లేదన్నది స్పష్టంగా అర్థం చేసుకోండి. కొన్ని పాలసీల్లో ఆసుపత్రిలో గది అద్దెలపై పరిమితి ఉంటుంది. లేదా పూర్తి మినహాయింపు ఉండవచ్చు. అలాగే ఏ ఏ ప్రొసీజర్లకు కవరేజీ వర్తిస్తుందో కూడా గమనించండి. వీటితోపాటు వీలైనంత వరకూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంత అదనపు మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసుకోవడమూ అవసరమే.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.


