ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొంది.. అప్పులపాలై దేశాన్ని విడిచిపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15మంది ఆర్ధిక నేరస్థులు బ్యాంకులకు రూ. 58,082 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.
లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు, పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. మొత్తం 15మంది ఆర్ధిక నేరస్థులలో.. 9 మంది పెద్ద మొత్తంలో ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, ఇద్దరు మాత్రమే పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారని అన్నారు. 15మంది బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.26,645 కోట్లు. వడ్డీ మొత్తం రూ. 31,437 కోట్లు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 (FEOA) నిబంధనల ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 15మంది నుంచి ఇప్పటివరకు 33 శాతం (రూ. 19187 కోట్లు) రికవరీ చేసినట్లు పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా వెనక్కి రావాల్సిన మొత్తం రూ. 38,895 కోట్లు అని అన్నారు.
అత్యధికంగా విజయ్ మాల్యా
విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ.6,848.28 కోట్లు అప్పు తీసుకోగా.. అది వడ్డీతో కలిపి రూ.11,960.05 కోట్లకు పెరిగింది. అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు సైతం ప్రకటనలు చేశాయి. నీరవ్ మోదీ ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ కంపెనీల ద్వారా మొత్తం రూ.7800 కోట్ల అప్పు తీసుకున్నారు. పీఎన్‌బీ వద్దే ఒకే మొత్తంలో రూ.6799.18 కోట్లు అప్పు తీసుకున్నారు.


