భారత్ దృష్టిలో తాము పరారీలో ఉన్న కీలకమైన వ్యక్తులమంటూ.. లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అలాంటి వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్‌లో పార్టీలు చేసుకుంటూ.. భారత దర్యాప్తు సంస్థలను(Enforcement Agencies) ఎగతాళి చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రంధీర్ జైస్వాల్ శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో స్పందించారు. “అలాంటి పరారీలను తిరిగి తీసుకురావడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రక్రియలో అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. చట్టపరమైన అనేక దశల కారణంగా ఆలస్యం జరుగుతోంది.అంతేతప్ప మరొక ఉద్దేశం లేదు. అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారాయన.
VIDEO | Delhi: “The Government of India is committed to bringing back all fugitives who have fled the country and evaded the law. Discussions are ongoing with several countries in this regard, and I want to assure you that we are firm and fully committed to ensuring their… pic.twitter.com/f7wcs5kwrR
— Press Trust of India (@PTI_News) December 26, 2025
బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం నుంచి పరారై లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా ఇటీవల(డిసెంబర్ 16న) 70వ పుట్టినరోజు చేసుకున్నారు. దీనికి భారత బిలియనీర్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ లలిత్ మోదీ, విజయ్ మాల్యా తాము అతి పెద్ద పరారీలో ఉన్న వ్యక్తులుగా నిలిచామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘లెట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ ఇన్ ఇండియా ఎగెయిన్ (మళ్లీ భారత్‌లో ఇంటర్నెట్‌ను బద్దలు కొడదాం)’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఫ్రాడ్, మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన వీళ్లు ఇలా వెటకారంగా స్పందించడం ఇదే తొలిసారి కాదు.
ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయి లండన్‌లో తలదాచుకున్నాడు. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఆ మధ్య ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన వెల్లడించాడు. కానీ, భారత ప్రభుత్వం ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల అబియోగాలు నమోదు చేసింది.
ఇక మరో బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈడీ ఇప్పటికే మాల్యా ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను ఉద్యోగులకు, బ్యాంకులకు తిరిగి ఇచ్చింది. అలాగే.. ఆయన్ని భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో కూడా పురోగతి కనిపిస్తోంది. అయితే..
భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిందటి ఏడాది పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా.. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.
అయితే ఆర్థిక మంత్రి ప్రకటన సమయంలో.. విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్‌డే శుభాకాంక్షలు’’ అంటూ ఓ పోస్ట్ చేశాడు.


