ఇరాన్‌లో అల్లకల్లోల పరిస్థితుల వేళ.. భారతీయుల తరలింపును భారత ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో భాగంగా పలువురితో బయల్దేరిన రెండు విమానాలు గత అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్ల ద్వారా అక్కడి పరిస్థితులను లోకల్ మీడియా సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.
ఢిల్లీకి చేరుకున్నవాళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తాము సురక్షితంగా రావడానికి కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని.. పలు సూచనలు జారీ చేస్తోందని వివరించారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నిరసనల గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇంటర్నెట్ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది’’ అని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ.. ‘‘వీధుల్లోకి వెళ్తే నిరసనకారులు కార్లను అడ్డుకునేవారు. ఇంటర్నెట్ లేకపోవడంతో కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాం. చాలా భయమేసింది’’ అని అన్నాడు. ఇక..
ఇరాన్‌లో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక ఇంజనీర్ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాడు. ‘‘ఇరాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పరిస్థితి మరీ ఘోరంగా ఏం లేదు. నెట్‌వర్క్ సమస్య తప్ప పెద్ద ఇబ్బందులేం లేవు’’ అని అన్నాడు. మరో యువతి మాట్లాడుతూ.. టెహహ్రాన్ నిరసనలు ప్రమాదకరంగానే సాగాయని, ఘర్షణల్లో పలు భవాలకు నిప్పు పెట్టారని.. ఆ పరిస్థితుల్లో భయంగా గడిపామని తెలిపింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు ఎక్కువగానే కనిపించారు అని వివరించింది.
డిసెంబర్ చివరిలో అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో మొదలైన భారీ నిరసనలు.. భద్రతా బలగాల ప్రతిఘటనలతో 3,000 మందిని బలిగొన్నాయి. ఇందులో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేల మందిని అరెస్ట్ చేయించింది ఖమేనీ ప్రభుత్వం. ఒకానొక తరుణంలో.. నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం, ఇరాన్ ఖండన, మాటల యుద్ధం.. సైనిక ఘర్షణకు దారి తీయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం తన పౌరులకు ఇరాన్ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో..
జనవరి 15న ఇరాన్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కొన్ని భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. అయితే గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం పరిస్థితి కొంత చల్లారింది. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికే వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఇరాన్‌లో సుమారు 10 వేలమంది భారతీయులు(విద్యార్థులు, ఉద్యోగులు, భారత మూలాలు ఉన్నవాళ్లు) ఉన్నట్లు విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్ని తీసుకొచ్చిన రెండు విమానాలు కమర్షియల్ ప్లైట్సే. అయితే ఇవి రెగ్యులర్ విమానాలేనని.. ఎలాంటి ప్రత్యేక తరలింపు కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ తరలింపును నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.


