భారతదేశంలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటమే. అయితే ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదరబోయే ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ప్రీమియం కార్లు కొనాలనుకునే వినియోగదారులకు కొంత ఊరటను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే.. దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లపై సుమారు 110 శాతం వరకు దిగుమతి సుంకం ఉంది. దీనివల్ల అక్కడ తక్కువ ధరకు లభించే కార్లు కూడా భారత్‌లో చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే కొత్త ఒప్పందం ప్రకారం ఈ దిగుమతి సుంకాన్ని నేరుగా 40 శాతానికి తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే.. ప్రీమియం కార్ల ధరలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.
దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువ గల అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ తక్కువ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.
దిగుమతి సుంకాలను తగ్గిస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్‌లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది.


