భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. అనేక వర్గాలకు అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా వైన్, విస్కీ అభిమానులు, లగ్జరీ కార్ల ప్రియులు, పరిశ్రమలు & సాధారణ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఈ ఒప్పందం ద్వారా ఇండియా ఉత్పత్తులు యూరప్ దేశాలకు ఎగుమతి, అక్కడి ఉత్పత్తులు భారతదేశానికి ఎక్కువగా దిగుమతి అవుతాయి. సుంకాలు చాలా వరకు తగ్గడం వల్ల.. యూరోపియన్ వస్తువులు మన దేశంలో చౌకగా మారనున్నాయి.
తగ్గనున్న ప్రీమియం కార్ల ధరలు
మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ కార్లపై ప్రస్తుతం దిగుమతి 100 శాతంగా ఉంది. అయితే ఒప్పందం ప్రకారం, 15,000 యూరోల కంటే ఎక్కువ.. అంటే దాదాపు రూ. 16 లక్షల విలువైన కార్లపై ఇప్పుడు 40 శాతం సుంకం విధిస్తారు. ఆ తరువాత ఈ ట్యాక్స్ క్రమంగా 10 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల కార్ల ధరలు చాలా తగ్గుతాయి.
మద్యం ధరలు
ఒప్పందం తరువాత ఫ్రాన్స్, ఇటలీ & స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకునే వైన్ చౌకగా లభించనుంది. ప్రస్తుతం, భారతదేశం దిగుమతి చేసుకునే వైన్‌పై 150 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తుంది. కొత్త ఒప్పందం దీనిని 20 శాతానికి తగ్గించాలని ప్రతిపాదిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ధరలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. అయితే 2.5 యూరోల కంటే తక్కువ ధర ఉన్న వైన్లకు విధించే ట్యాక్స్ విషయంలో ఎలాంటి రాయితీ ఉండదు.
ఔషధాలు (మెడిసిన్స్)
యూరప్ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సాంకేతికతలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఒప్పందం కారణంగా.. క్యాన్సర్ & ఇతర అనారోగ్యాలకు కావలసిన దిగుమతి చేసుకున్న మందులు, వైద్య పరికరాల ధరలు భారతదేశంలో తగ్గనున్నాయి.
ఇదీ చదవండి: భారత్-ఈయూ ఒప్పందం: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?
ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలు
వాణిజ్య ఒప్పందంతో..దిగుమతి చేసే విమానాల విడిభాగాలు, మొబైల్ ఫోన్లు & హైటెక్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు అవుతాయి. దీంతో ఈ వస్తువుల తయారీ ఖర్చులు తగ్గి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాడ్జెట్లు మరింత చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది భారత్‌లో తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, సాంకేతిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.
ఉక్కు & రసాయన ఉత్పత్తులు
వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇనుము, ఉక్కు & రసాయన ఉత్పత్తులపై సున్నా సుంకాలు (Zero Tariffs) విధించాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, తయారీ పరిశ్రమలు లాభపడతాయి. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు తగ్గి, దీని ప్రభావం చివరికి వినియోగదారులకు కూడా మేలు చేసేలా ఉండనుంది.


