క్రమబద్ధీకరణపై కోర్టుల తీర్పులు అమలు చేయరాదని నిర్ణయం
1994 చట్టానికి సవరణలు చేయాలని తీర్మానించిన మంత్రివర్గం
ఐదేళ్లు పనిచేసిన ఫుల్‌టైమ్ ఉద్యోగులు, పదేళ్లు చేసిన పార్ట్‌టైమ్ ఉద్యోగులకు ఎదురుదెబ్బ
చట్టానికి సవరణలు చేస్తూ నేడో, రేపో ఆర్డినెన్స్ జారీ!
రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వంపై రూ.26 వేల కోట్ల భారం పడుతుందన్న ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. పాత పెన్షన్, సర్వీసు క్రమబద్ధీకరణ కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న ఉద్యోగులకు న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పులిచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు 1994 చట్టం (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్)కు సవరణ చేయనుంది.
ఈ నెల 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిపై నేడో రేపో ఆర్డినెన్స్ జారీ కానున్నట్లు తెలిసింది. 1993 అక్టోబర్ 25 నాటికి ఐదేళ్ల ఫుల్‌టైమ్ సర్వీసు, పదేళ్ల పార్ట్‌టైమ్ సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు వీలుగా, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 1994 ఏప్రిల్ 22న జీవో నంబర్ 212, ఆ తర్వాత 1997 జూలై 23న జీవో 112 ప్రభుత్వం జారీ చేసింది.
ఈ జీవోల్లోని అంశాలను 1998 చట్టంలోనూ చేర్చారు. అప్పట్లో క్రమబద్దీకరణకు ఉత్తర్వులు జారీ అయినా ఆ మేరకు ప్రభుత్వ శాఖల్లో సరిపడా ఖాళీలు లేకపోవడం వల్ల ఒకేసారి క్రమబద్ధీకరణ చేయలేకపోయారు. పోస్టుల ఖాళీలు ఏర్పడిన తర్వాత వాటికి అనుగుణంగా క్రమబదీ్ధకరిస్తూ వచ్చారు. ఆ ఉత్తర్వుల మేరకు కొంత మంది ఉద్యోగులు 2004 కొత్త పెన్షన్ విధానానికి ముందు క్రమబద్ధం కాగా.. ఆ తర్వాత నెమ్మదిగా రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ పొందిన వారు, ఇంకా క్రమబదీ్ధకరణ కావాల్సిన వారు దాదాపు 7 వేల మంది ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చింది
పాత పెన్షన్ విధానం కోసం కోర్టులకు..
క్రమబద్దీకరణ పూర్తయిన వారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తుండగా, మరికొందరు క్రమబద్ధీకరణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ విధానం అమలులోకి వచ్చిన తరువాత క్రమబద్ధం అయిన వారు తాము ఎన్‌ఎంఆర్‌లుగా చేస్తున్నప్పటి నుంచి ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల, విద్యాశాఖల్లోని కొందరికి అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. ప్రభుత్వం ఆ తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయినా సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఏకంగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది.
ఉత్తర్వులు అమలు చేయాల్సిన అవసరం లేకుండా..!
న్యాయస్థానాల తీర్పును అమలు చేస్తే ఖజానాపై రూ.26 వేల కోట్లకు పైగా భారం పడుతుందని, ఇప్పట్లో దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ నివేదించిన నేపథ్యంలో.. ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తెస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. కొత్త చట్ట సవరణకు అనుకూలం కాని.. న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ ఉత్తర్వులు, డిక్రీ, తీర్పులను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుందని అంటున్నారు.
వివాదాలకు దారి తీస్తుండటంతో..
క్రమబద్ధీకరణ కోసం అప్పట్లో జారీ చేసిన జీవోల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి..పరిపాలన పరమైన ఆలస్యం, పోస్టులు లేకపోవడం కారణంగా ఆ ఉత్తర్వులను పొడిగిస్తూ రావడం వల్ల ఇంకా పలు శాఖలు క్రమబద్ధీకరణ అంశాలను పరిశీలిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రివర్గానికి అందజేసిన నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్రమబద్ధీకరణ ఆలస్యం కాస్తా వివాదాలకు దారి తీస్తోందని వివరించింది.
మరోవైపు న్యాయస్థానాలు ఇచి్చన తీర్పులను అమలు చేయకపోవడంతో ఆగ్రహిస్తున్న పలువురు ఉద్యోగులు అధికారులపై న్యాయ ధిక్కరణ కేసులు కూడా నమోదు చేస్తున్నారని వెల్లడించింది. వీటన్నింటికీ ముగింపు పలకాలంటే.. కొత్తగా క్రమబదీ్ధకరణ/పాత పెన్షన్‌ను అమలు.. చేయకుండా చట్ట సవరణ చేయడం ఒక్కటే మార్గమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఆర్డినెన్స్ తేవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అందెశ్రీ తనయునికి ఉద్యోగం కోసం..
ప్రముఖ కవి, జయ జయ జయహే రాష్ట్ర గీతం రచయిత, ఇటీవల మరణించిన అందెశ్రీ తనయుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కల్పించాలని మంత్రివర్గం (సెక్షన్ 4 ఆఫ్ యాక్ట్ 2 ఆఫ్ 1994ను సవరించి) నిర్ణయించింది. అయితే ఈ చట్టం ప్రకారం దత్తసాయికి ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని తేలడంతో చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.


