
5 త్రైమాసికాల తదుపరి జోష్
యాంటీడంపింగ్ డ్యూటీల దన్ను
ద్వితీయార్థంలో రికవరీపై ఆశలు
ప్రొడక్టులకు బలపడుతున్న డిమాండ్
సుమారు ఐదు త్రైమాసికాలుగా అంతంతమాత్ర పనితీరు చూపుతూ వచ్చిన ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీలు ఇకపై బలాన్ని పుంజుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) ద్వితీయార్ధం నుంచి రికవరీ బాటలో సాగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి ప్లాస్టిక్ పైపులు, తదితర ప్రొడక్టుల తయారీ దిగ్గజాలకు ప్రోత్సాహం లభించనున్నట్లు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం..
కొద్ది నెలలుగా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటిస్తున్న ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీలు ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లోనూ ఓమాదిరి పనితీరునే ప్రదర్శించాయి. అయితే పలు సానుకూల అంశాల ప్రభావంతో ద్వితీయార్ధం(2025 అక్టోబర్–మార్చి 2026)లో మెరుగైన ఫలితాలను సాధించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రొడక్టులకు డిమాండ్ పుంజుకోవడం, పాలీవినైల్ క్లోరైడ్(పీవీసీ) ధరలు నిలకడను చూపడం ఇందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం పటిష్ట డిమాండ్‌కు తోడు ముడివయ్యాలు తగ్గడం కంపెనీలకు కలసిరానుంది. ప్రధానంగా ప్రతిపాదిత యాంటీడంపింగ్ డ్యూటీలు దేశీ పరిశ్రమలకు జోష్‌నివ్వనున్నాయి. ఈ సానుకూలతల కారణంగా ఇటీవల పీవీసీ కంపెనీల షేర్లు పరుగెడుతున్నాయి.
ప్రభుత్వ మద్దతు
ఇటీవలే వాణిజ్య పరిష్కార సంబంధ చర్యలు తీసుకునే ట్రేడ్ రెమిడీస్ డైరెక్టరేట్ జనరల్(డీజీటీఆర్).. పీవీసీ రెజిన్ దిగుమతులపై తుది పరిశీలనను పూర్తి చేసింది. తద్వారా యాంటీడంపింగ్ డ్యూటీల విధింపునకు దారి చూపనుంది. ప్రధానంగా చైనా, ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, యూఎస్‌ల నుంచి పీవీసీ రెజిన్ దిగుమతి అవుతోంది. దీంతో దిగుమతులు, దేశీ ఉత్పత్తి మధ్య ధరల్లో వ్యత్యాసం తగ్గనుంది.
కాగా.. భారత్ పీవీసీ దిగుమతులపై అధికంగా ఆధారపడుతోంది. దేశీ డిమాండ్ వార్షికంగా 4.7 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ)కాగా.. స్థానిక తయారీ సామర్థ్యం 1.8 ఎంటీపీఏ మాత్రమే. దీంతో పీవీసీ రెజిన్ కోసం విదేశాలవైపు చూపు సారిస్తోంది. ఫలితంగా పరిశ్రమపై అంతర్జాతీయ ధరల ప్రభావం పడుతోంది. అయితే 2027 కేలండర్ ఏడాదిలో దేశీయంగా 2.5 ఎంటీపీఏ సామర్థ్యం అందుబాటులోకి వచ్చే వీలుంది. వెరసి పీవీసీ దిగ్గజాలు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే అవకాశముంది.
సానుకూలతలు
దేశీయంగా పీవీసీ రెజిన్ సరఫరాలు పుంజుకుంటే పైపుల తయారీ కంపెనీలకు లబ్ది చేకూరనుంది. ముడిసరుకుల స్థానిక లభ్యతపై విశ్వాసం, ధరల హెచ్చుతగ్గులకు చెక్ పెట్టడం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తగ్గడం, నిర్వహణ లాభ మార్జిన్లకు రక్షణ తదితర ప్రయోజనాలకు వీలుచిక్కుతుందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
యాంటీడంపింగ్ చర్యలతో స్థానిక తయారీకి మద్దతు, పీవీసీ రెజిన్ ధరల నిలకడ ద్వారా ఈ రంగంలోని పరిశ్రమల లాభదాయకత మెరుగుపడనున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ నిపుణులు తెలియజేశారు. ప్రధానంగా లిస్టెడ్ కంపెనీలు ఆస్ట్రల్, సుప్రీం, ఫినొలెక్స్ లబ్ది పొందనున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు పీవీసీ రెజిన్ ధరలు ఐదు నెలల తదుపరి మే నెలలో తొలిసారి బలపడ్డాయి. కేజీ ధర రూ. 1.5 పుంజుకోగా.. ఆగస్ట్‌కల్లా మరో రూ. 4.6 పెరిగాయి.
పనితీరు డీలా
ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో పీవీసీ రంగ కంపెనీల ఫలితాలు డీలా పడ్డాయి. ఉమ్మడి ఆదాయం వార్షికంగా 3 శాతం నీరసించగా.. ప్రొడక్టులకు ధరలు(రియలైజేషన్లు) 8% క్షీణించాయి. అయితే అమ్మకాలు 3 శాతం వృద్ధి చూపాయి. అయినప్పటికీ నిర్వహణ లాభం(ఇబిటా) వార్షికంగా 27 శాతం వెనకడుగు వేసింది. ఈ కాలంలో కేజీకి ఇబిటా 41 శాతం పడిపోయింది. నిల్వలపై భారీ నష్టాలు ఇందుకు కారణమయ్యాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్