ముచ్కూర్ వాసి శనిగరం సంతోష్ రెడ్డి ప్రస్థానం
మోర్తాడ్(బాల్కొండ): సొంత గ్రామానికి సర్పంచ్‌గా ఎంపిక కాలేకపోయినా ఆర్మూర్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వివిధ శాఖలకు మంత్రిగా, ఒకసారి జడ్పీ చైర్మన్‌గా ఎంపికైన శనిగరం సంతోష్‌రెడ్డి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. భీమ్‌గల్ మండలం ముచ్కూర్‌కు చెందిన సంతోష్ రెడ్డి 1971లో సర్పంచ్‌గా ఎంపిక కావాలనే ఉద్దేశ్యంతో వార్డు స్థానానికి పోటీ చేశారు. అప్పట్లో వార్డు సభ్యునిగా ఎంపికైన వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు.
అలా వార్డు సభ్యునిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గ్రామ రాజకీయాలు కలిసి రాకపోవడంతో ఇందిరా కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలక నేతగా గుర్తింపు పొంది 1978లో తొలిసారి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1989లో మరోసారి ఎమ్మెల్యేగా ఎంపికై ఆర్థిక శాఖ, రోడ్లు భవనాలు, భారీ పరిశ్రమల శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2002లో భీమ్‌గల్ జడ్పీటీసీగా గెలిచి బీఆర్‌ఎస్ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కొన్ని నెలలపాటు పనిచేశారు.


