హైదరాబాద్: దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్ టీమ్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో కీలక ఆధారాలను సేకరించింది. పెద్ద ఎత్తున నడుస్తున్న డ్రగ్స్ దందాను గుర్తించిచామన్న అధికారులు.. రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లో మల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసులను విచారించగా ఈ డ్రగ్స్ మాఫియా బయటపడింది. ఢిల్లీలో 20 ప్రాంతాలతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖలో తనిఖీలు నిర్వహించాం. ఒక్క ఢిల్లీలోనే 16 విక్రయ కేంద్రాలను గుర్తించాం. యాభై మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నాం. వీళ్లలో చాలామందిని డిపోర్ట్ చేయించే ఉద్దేశంలో ఉన్నాం.
నైజీరియాకు చెందిన నిక్కీ ఆధ్వర్యంలో ఈ దందా నడిచింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుంది ఈ నెట్‌వర్క్. ఇప్పటిదాకా సుమారు 2 వేల మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించాం. ప్రముఖ కొరియర్, పార్శిల్స్ సర్వీసులతోనే ఈ వ్యవహారం నడిచింది. గార్మెంట్స్, కాస్మోటిక్స్, షూల మధ్యలో ఉంచి పంపిణీ చేశారు.
వందలాది మ్యూల్ అకౌంట్లు చేర్పాటు చేసి లావాదేవీలు నడిపారు. సుమారు 2,000సార్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించాం. 59 మ్యూల్ అకౌంట్లు సీజ్ చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నాం. హైదరాబాద్‌కు చెందిన 11 మంది డ్రగ్స్ పెడ్లర్లను గుర్తించి అరెస్ట్ చేశాం అని ఈ భారీ ఆపరేషన్ వివరాలు మీడియాకు వెల్లడించారు.


