యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు రెండు వికెట్లు కోల్పోయి చేధించారు. ట్రావిస్ హెడ్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినప్పటికి.. జెక్ వెదర్‌ల్డ్ 17, స్టీవ్ స్మిత్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.
అదరగొట్టిన రూట్..
ఈ పింక్‌బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెటరన్ బ్యాటర్ (206 బంతుల్లో 138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ 76 పరుగులు చేశాడు. ఆఖరిలో జోఫ్రా ఆర్చర్( 38 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మరోసారి 6 వికెట్లతో సత్తాచాటాడు.
అనంతరం ఇంగ్లీష్ జట్టుకు ఆసీస్ ధీటైన సమాధానమిచ్చింది. స్మిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. స్టార్ మిచెల్ స్టార్క్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెక్ వెదర్‌ల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65) పరుగులు, స్టీవ్ స్మిత్ (61), (అలెక్స్ క్యారీ 63) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ ఫెయిల్..
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తేలిపోయారు. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు కేవలం 241 పరుగులకే ఆలౌటైంది. జాక్ క్రాలీ(44), స్టోక్స్(50) రాణించినప్పటికి.. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో పర్యాటక జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.
ఈ క్రమంలో ఆసీస్ ముందు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మైఖల్ నీసర్ ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ


