ఐపీఎల్-2025 విజేత ఆర్సీబీ (PC: BCCI)
టీ20 క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే యూరోప్‌లో సైతం EUT20 Belgium పేరిట టోర్నీని ప్రవేశపెట్టారు. ఇక క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో పొట్టి క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా
దేశంలో 2008లో ప్రవేశపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పటికీ పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఆశపడతాడనటంలో సందేహం లేదు.
ప్రతిభ ఉన్న యువ, అన్‌క్యాప్డ్ క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం ఇందుకు కారణం. ఐపీఎల్‌లో ఆడిన తర్వాత జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కూడా కోకొల్లలు. అయితే, ప్రపంచ క్రికెటర్ల సమాఖ్య (WCA) మాత్రం ఐపీఎల్‌కు టాప్-10 ర్యాంకులలో మూడో స్థానం ఇవ్వడం గమనార్హం.
ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లకు సంబంధించి WCA గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌కు ప్రథమ స్థానం కట్టబెట్టిన సమాఖ్య.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు రెండో ర్యాంకు ఇచ్చింది.
క్యాష్ రిచ్.. కానీ బెస్ట్ కాదు!
క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను మూడో స్థానానికి పరిమితం చేసిన WCA.. బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్ సూపర్ లీగ్‌లకు టాప్-5లో చోటు ఇచ్చింది.
ఆటగాళ్లకు చెల్లించే కనీస మొత్తం, సగటు, భద్రతా ప్రమాణాలు, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, వాణిజ్యపరమైన హక్కులు, ఆదాయంలో వాటా, ప్లేయర్/ఏజెంట్ అప్రూవల్ తదితర పదమూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని WCA ఈ ర్యాంకులు ఇచ్చింది.
ఈ అంశాలలో మెరుగుపడాలి!
ఇందులో భాగంగా ది హండ్రెడ్‌కు వందకు 75.2 మార్కులు రాగా.. సౌతాఫ్రికా లీగ్‌కు 68.0 మార్కులు వేశారు. ఇక ఐపీఎల్‌కు వందకు 62.6 మార్కులే పడ్డాయి. ఆటగాళ్లకు చెల్లింపు విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌గా ఐపీఎల్‌ను పేర్కొన్న WCA.. సెక్యూరిటీ రివ్యూ, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, ఆదాయంలో వాటా తదితర అంశాల్లో మాత్రం మెరుగుపడాలని సూచించింది.
పాక్ పరిస్థితి ఇదీ
ఇక బిగ్‌బాష్ లీగ్‌కు 62.5 మార్కులు రాగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌కు 48 మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28న మొదలుకానుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలుత 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేయడం గమనార్హం.
అంతటా మనోళ్లదే పైచేయి
కాగా WCA ప్రకటించిన టాప్-2 ర్యాంకులలో ఉన్న.. ‘ది హండ్రెడ్’, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో అత్యధిక జట్లు ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంఛైజీల యాజమాన్యంలోనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీల ఓనర్లవే కావడం విశేషం. అంతేకాదు కరేబియన్ ప్రీమియర్ లీగ్, ILT20లోనూ వీరి పెట్టుబడులే ఎక్కువ.
చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్


