మా నాన్నలా కాదు!.. పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా? | Arjun Tendulkar leaves Pant impressed with Sachin style technique | Sakshi
Sakshi News home page

మా నాన్నలా కాదు!.. పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?

Mar 19 2026 5:55 PM | Updated on Mar 19 2026 6:22 PM

Arjun Tendulkar leaves Pant impressed with Sachin style technique

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండుల్కర్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఏకంగా వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇలాంటి ఇంకెన్నో చిరస్మరణీయ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెజెండరీ బ్యాటర్‌.

ఇప్పటికీ గుర్తింపు అంతంతమాత్రమే
ఇక సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ కూడా తండ్రి బాటలో ‍క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కానీ ఇప్పటికీ తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడీ 26 ఏళ్ల ఆల్‌రౌండర్‌. దేశీ క్రికెట్‌లో తొలుత  ముంబైకి ఆడిన అర్జున్‌.. తర్వాత గోవాకు మారిపోయి అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

ఇక ఐపీఎల్‌లో తండ్రి సచిన్‌ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ (MI) తరఫున 2023లో అరంగేట్రం చేశాడు అర్జున్‌. ఇప్పటికి మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు అర్జున్‌ను వదిలేసిన ముంబై.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)కు అతడిని ట్రేడ్‌ చేసింది.

ఈసారి లక్నో తరఫున అయినా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అర్జున్‌ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌తో అర్జున్‌ సంభాషించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో పంత్‌.. అర్జున్‌ టెండుల్కర్‌ బ్యాట్‌ బరువు గురించి అడుగగా..

మా నాన్నలా కాదులే!.. 
‘‘1220 గ్రాముల బరువు ఉండవచ్చు. ఇంతకంటే తక్కువ బరువున్న బ్యాట్‌తో నేను ఆడలేను. మా నాన్న అయితే 1301-1315 గ్రాముల బరువున్న బ్యాట్‌ వాడేవారు. నేను అలా కాకుండా 1220 గ్రాముల బరువు ఉన్నది వాడతాను. బ్యాట్‌ ఎలా ఉన్నా బంతిని బాదడమే అంతిమ లక్ష్యం’’ అని అర్జున్‌ సమాధానం ఇచ్చాడు.

పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?
ఇక ఆట పట్ల అర్జున్‌ టెండుల్కర్‌ అంకిత భావం గురించి రిషభ్‌ పంత్‌ ప్రస్తావిస్తూ.. ‘‘యువరాజ్‌ సింగ్‌ పాజీతో కలిసి నువ్వు ప్రాక్టీస్‌ చేస్తున్నావు కదా! పెళ్లైన మరుసటి రోజే నెట్స్‌కి వచ్చేశావు. క్రికెట్‌ పట్ల నువ్వు అత్యంత ఆసక్తిగా, ఉత్సుకతతో ఉన్నావు సోదరా!’’ అని పేర్కొన్నాడు.

కాగా మార్చి 5న సానియా చందోక్‌తో.. అర్జున్‌ టెండుల్కర్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మార్చి 28 నుంచి ఐపీఎల్‌-2026 ఆరంభం కానుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్‌ రిక్వెస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement