సెమీఫైనల్లో జర్మనీ చేతిలో భారత్ పరాజయం
బుధవారం అర్జెంటీనాతో కాంస్యం కోసం పోరు
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. స్వదేశంలో జరుగుతున్న జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టుతో ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు 1–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 2–1తో అర్జెంటీనాపై గెలిచింది. బుధవారం జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో జర్మనీ; మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ తలపడతాయి.
క్వార్టర్ ఫైనల్లో బెల్జియంపై ‘షూటౌట్’లో గట్టెక్కిన టీమిండియాను సెమీఫైనల్లో జర్మనీ హడలెత్తించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ భారత రక్షణపంక్తికి పని కల్పించింది. 13 నిమిషాలపాటు జర్మనీని నిలువరించిన టీమిండియా... నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. 14వ నిమిషంలో లుకాస్ కోసెల్... 15వ నిమిషంలో టిటుస్ వెక్స్ ఒక్కో గోల్ చేయడంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి జర్మనీ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అనంతరం 30వ నిమిషంలో లుకాస్ కోసెల్ రెండో గోల్ చేయడంతో రెండో క్వార్టర్ ముగిసేసరికి జర్మనీ ఆధిక్యం 3–0కు పెరిగింది. మూడో క్వార్టర్‌లోనూ జోరు కొనసాగించిన జర్మనీకి 40వ నిమిషంలో జోనస్ వోన్ జెర్సుమ్ గోల్ అందించాడు. చివరి క్వార్టర్‌లోని 49వ నిమిషంలో బెన్ హస్బాచ్ గోల్‌తో జర్మనీ ఆధిక్యం 5–0కు పెరిగింది. 51వ నిమిషంలో భారత్‌కు అన్‌మోల్ ఎక్కా ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ మొత్తంలో జర్మనీ జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించింది.
జర్మనీ ఒక పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేసుకుంది. భారత్‌కు దక్కిన ఒక్క పెనాల్టీ కార్నర్‌ను అన్‌మోల్ లక్ష్యానికి చేర్చాడు. 12వసారి జూనియర్ ప్రపంచకప్‌లో ఆడుతున్న భారత జట్టు రెండుసార్లు (2001, 2016) విజేతగా, ఒకసారి రన్నరప్‌గా (1997) నిలిచింది. మూడుసార్లు (2005, 2021, 2023) కాంస్య పతకం మ్యాచ్‌లో ఓడిపోయి టీమిండియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
క్వార్టర్స్ చేరని భారత జట్టు
మరోవైపు చిలీలోని సాంటియాగోలో జరుగుతున్న మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నీలోనూ భారత జట్టుకు నిరాశే మిగిలింది. లీగ్ దశ ముగిశాక జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు టాప్–8లో చోటు దక్కించుకోకపోవడంతో క్వార్టర్ ఫైనల్ చేరలేకపోయింది. గ్రూప్ ‘సి’లో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఆరు గ్రూపుల్లో ‘టాప్’లో నిలిచిన ఆరు జట్లతోపాటు (నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, చైనా, ఆ్రస్టేలియా, అమెరికా)... రెండో స్థానంలో నిలిచిన రెండు ఉత్తమ జట్లకు (అర్జెంటీనా, ఇంగ్లండ్) క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు లభించాయి. రెండో స్థానంలో నిలిచిన ఆరు జట్లలో భారత జట్టు మూడో స్థానంలో ఉండటంతో క్వార్టర్ ఫైనల్‌కు దూరమైంది.


