యాషెస్ సిరీస్ 2025-26లో వరుస ఓటములతో సతమవుతున్న ఇంగ్లండ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఎడమ మోకాలి గాయం కారణంగా యాషెస్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వుడ్ మోకాలి గాయం బారిన పడ్డాడు. దీంతో ఆ టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స (knee surgery) చేయించుకుని దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.
పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడికి మళ్లీ ఎడమ మోకాలి గాయం తిరగబెట్టింది. అతడు కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.
మూడేళ్ల తర్వాత..
ఇక వుడ్ స్థానంలో యార్క్‌షైర్ పేసర్ మ్యాథ్యూ ఫిషర్ ను జట్టులోకి తీసుకున్నారు. మ్యాథ్యూ ఫిషర్ ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కావడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిషర్ 2022లో ఇంగ్లండ్ తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఒకే మ్యాచ్ ఆడి ఒక్క వికెట్ సాధించాడు.
ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి. ఎందకంటే ఇప్పటికే బ్యాకప్ పేసర్లగా మ్యాథ్యూ పాట్స్ (Matthew Potts), జోష్ టంగ్ (Josh Tongue) వంటి ఆటగాళ్లు ఉన్నారు.
మరోవైపు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ కూడా గాయం కారణంగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2 తేడాతో వెనకంజలో ఉంది.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..!


