
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ మధ్యే నాగమల్లయ్య అనే కర్ణాటకవాసిని డల్లాస్‌లో ఓ వలసదారుడు అతికిరాతకంగా తల నరికి చంపడమూ చూశాం. అయితే.. ఇందుకు భిన్నంగా కాలిఫోర్నియా స్టేట్‌లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పసికందులపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగాన్ని.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మట్టుపెట్టాడు. అక్కడి వార్తా సంస్థల కథనాల ప్రకారం.. సెప్టెంబర్ 18వ తేదీన ఫ్రెమాంట్ సిటీ(Fremont City)లో డేవిడ్ బ్రిమ్మర్(71) అనే వ్యక్తి వరుణ్ సురేష్(29) చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం పోలీసులకు తానే సమాచారం అందించి నిందితుడు లొంగిపోయాడు. ఈ క్రమంలో..
విచారణ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన హత్యా అభియోగాలను పోలీసులు అధికారికంగా నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత.. అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఘటన ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. అయితే..
వరుణ్ సురేష్(Varun Suresh) పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. చనిపోయిన డేవిడ్ బ్రిమ్మర్ గతంలో పసికందులపై లైంగిక వేధింపులకు పాల్పడి.. తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిచి వచ్చాడు. పబ్లిక్ సె* అఫెండర్ రిజిస్ట్రీలో అతని పేరు కూడా నమోదు అయ్యింది. ఇది గమనించిన వరుణ్ సురేష్.. అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని అనుకున్నాడు.

పబ్లిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వేషంలో ఓ బ్యాగు వేసుకుని కస్టమర్ల కోసం ప్రతీ ఇంటికీ తిరిగే ముసుగులో బ్రిమ్మర్ కోసం నెలలపాటు వెతికాడు. అలా ఆఖరికి.. బ్రిమ్మర్ ఇంటి తలుపు తట్టి కలుసుకున్నాడు. ఆపై చుట్టుపక్కల వాళ్లను అతని గురించి ఆరా తీశాడు. తాను వెతుకుతున్న వ్యక్తి అతనేనని ధృవీకరించుకున్నాడు.
సెప్టెంబర్ 18వ తేదీన మరోసారి డేవిడ్ బ్రిమ్మర్(David Brimmer) ఇంటి తలుపు తట్టాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మెడలో తన దగ్గర ఉన్న కత్తితో పోట్లు పొడిచాడు. చేసిన ఘాతుకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా? అని ఆరా తీశాడు. అయితే రక్తపు మడుగులో బ్రిమ్మర్ అతన్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేయబోయాడు. ఈ క్రమంలో బ్రిమ్మర్ గొంతును కోసి తాను చేపట్టిన సర్పయాగం వరుణ్ పూర్తి చేశాడు.
చేసిన నేరానికి తానేం బాధపడడం లేదని, పైగా అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వరుణ్ సురేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వరుణ్ సురేష్ 2021లో ఓ ఆసక్తికరమైన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఫ్రెమంట్‌లోనే ఓ ప్రముఖ హోటల్‌లో బాంబు ఉందని బెదిరించడమే కాక.. చోరీకి ప్రయత్నించాడనే నేరం కింద మూడు నెలల జైలు జీవితం గడిపాడు. అయితే.. ఆ హోటల్ సీఈవో కూడా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. ఆ సమయంలో అతన్ని చంపేందుకే తీవ్రంగా ప్రయత్నించాడనని వరుణ్ సురేష్ ఇప్పుడు వెల్లడించడం గమనార్హం. అలమెడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసు విచారణ జరుపుతోంది. వరుణ్ సురేష్ నేపథ్యం ఏంటి?.. అతను పసికందులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని(Paedophile) ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు?. అనే వివరాలు తెలియరావాల్సి ఉంది.