
వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవ.. అమెరికాలో దారుణానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఓ భారతీయుడ్ని అతని కింద పని చేసే వ్యక్తి కత్తితో తల నరికి చంపాడు. టెక్సాస్ సిటీ డల్లాస్ నగరంలో జరిగిన ఈ భయానక ఘటన వివరాల్లోకి వెళ్తే..
ప్రత్యక్ష సాక్షి అయిన ఓ మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ మోటల్‌లో ఆమె, నిందితుడు యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ పని చేస్తున్నారు. ఓ గదిని శుభ్రం చేస్తున్న టైంలో మోటల్ మేనేజర్ చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య(50), కోబాస్ వద్దకు వచ్చి విరిగిపోయిన వాషింగ్ మెషీన్ వాడొద్దంటూ చెప్పాడు. అయితే..
ఆ విషయాన్ని నేరుగా కోబాస్‌కు చెప్పలేకపోయాడు. భాష కాస్త ఇబ్బంది కావడంతో ఆ మహిళకు చెప్పి.. కోబాస్‌కు చెప్పమని సూచించాడు. అయితే ఈ గందరగోళంతో కోబాస్ రగిలిపోయాడు. నేరుగా తన గదికి వెళ్లి.. బ్యాగులో ఉన్న కత్తితో వచ్చాడు.
ఆ కత్తితో నాగమల్లయ్యపై దాడికి ప్రయత్నించాడు. దీంతో నాగమల్లయ్య ప్రాణాల కోసం పరుగులు తీశాడు. ఈలోపు మల్లయ్య భార్య, కొడుకు రక్షించాలని చూసినా.. వారిని కోబాస్ పక్కకు తోసేశాడు. ఆ మోటల్ ఫ్రంట్ ఆఫీస్‌లో నాగమల్లయ్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నాగమల్లయ్య తల తెగిపడింది.
అనంతరం ఆ తలను కాలితో తన్నడంతో అది బయటకు దొర్లుకుంటూ వెళ్లిపోయింది. ఆపై ఆ తలను చేత పట్టుకుని దగ్గర్లోని ఓ డస్ట్‌బిన్‌లో పడేశాడు. చేతిలో కత్తితో ఉన్న కోబాస్‌ను చూసి బయట ఉన్నవాళ్లు భయంతో దూరం జరిగారు.
ఈ ఘటనలో.. హత్యానేరం కింద కోబాస్(37)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించింది. నిందితుడు ప్రస్తుతం డల్లాస్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందించేదుకు సిద్ధమని ప్రకటించింది. చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య స్వస్థలం, కుటంబ నేపథ్యం తదితర వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. అక్కడి మీడియా ఈ ఘటనను హైలైట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినవస్తున్నాయి.
