ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదుల జరిపిన మారణ కాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి వార్తల్లో నిలిచారు. బాధితుల్లో ఎక్కువ మందిని కాపాడి పాషా రహమత్ హైదరాబాద్‌కు చెందిన వారు. పాషా ధైర్యం, తెగువ తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది. ఆరేళ్లకు పైగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రహమత్ పాషా, సిడ్నీలో జరిగిన బాండీ బీచ్ ఉగ్రవాద దాడి సందర్బంగా చూపిన ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన దాదాపు 20 మంది బాధితులను రక్షించడంలో, వారికి సహాయం చేయడంలో పాషా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అత్యంత క్లిష్ట సమయాల్లో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ యువకుడిని వీరుడిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు వెల్లువెత్తాయి. 'హైదరాబాద్‌కి షాన్' పాషాతో సాక్షి ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..
మానవత్వమే ముఖ్యమనుకున్నా
‘‘ఇండియా నుంచి వచ్చిన చాలా మంది లాగానే నేను కూడా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. సండే కనుక బీచ్ చాలా సందడిగా ఉంది. ఉన్నట్టుండి శబ్దం వినిపించింది. ముందు ఏవో క్రాకర్లు అనుకున్నాను. కానీ అవి తుపాకీ కాల్పుల శబ్దాలు అని తరువాత తెలిసింది. దుండగుడికి సమీపంలోనే తను వెనుకనే నేను ఉన్నా. ముందు నాకు చాలా భయమేసింది. ఎక్కడ చూసినా అరుపులు కేకలు. అందరి ఎవరికి వారు పారిపోతున్నారు. ఒక పెద్దావిడ సాయం అడుగుతున్నపుడు నేను కాదనలేకపోయాను. అపుడు ఆమెకు కాపాడటమే ముఖ్యం అనుకున్నాను. ఆమెను రక్షించడంలో సాయపడ్డాను. నా కళ్లముందే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో పడిపోయారు.
దేశం, కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నింటికంటే మానవత్వం ముఖ్యం అనుకున్న. నాకు నా మతం కూడా అదే నేర్పించింది. అలా నన్ను సాయం అడిగిన మహిళతో పాటు, ఒక పోలీసు సహా 20 మంది వరకు గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించాము. అర్థరాత్రి దాకా వారిని అంబులెన్స్‌లో తరలిస్తూనే ఉన్నాం. ఆ తరువాత ఒక్కసారిగా నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఎపుడూ ఇలాంటి దుర్ఘటనలు చూడలేదు. అందుకే చెప్పలేనంత దుఃఖం పొంగుకొచ్చింది. బాధితుల ఆర్తనాదాలు,పచ్చని పరిసరాలు రక్తం మరకలతో నిండిపోయిన దృశ్యాలు కళ్ల ముందు కదలాడాయి. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోలేని విషాదంగా మిగిలిపోతుంది. నా కళ్లముందు అలా మనుషులు చనిపోవడం తట్టుకోలేనంత బాధను మిగిల్చింది.
ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక
నిద్ర రావడంలేదు
ఈ దుర్ఘటనను తలచుకుంటే నా మనసంతా కకావికలమైపోతుంది. నిద్ర రావడంలేదు. మరీ ముఖ్యంగా నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వాడు కావడంతో నా కుటుంబానికి, నా భార్య, బిడ్డకు ఏదైనా హాని చేస్తాడేమోనని చాలా భయమేస్తోంది. అందుకే మానసిక చికిత్స తీసుకుంటున్నాను. నా పాపకు స్టడీ, మంచి జీవితం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను అంటూ తన అనుభవాలను షేర్‌చేసుకున్నారు పాషా. 2019 నుండి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రహమత్ పాషాకు హైదరాబాద్‌లో కుటుంబం ఉంది. తల్లి దండ్రులు, భార్య చిన్న పాప ఉన్నారు.
కాగా, ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత కిరాతకంమైన ఘటనగా నిలిచిన బాండీ బీచ్ కాల్పుల ఘటన నిందితుల మూలాలు హైదరాబాద్‌లో తేలడం కలకలం రేపింది. తండ్రీకొడుకులైన సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) పక్కా వ్యూహంతోనే ఈ మారణహోమానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.


