జి. చిన్నారెడ్డి కి వినతిపత్రం ఇస్తున్న సునీత
గ్రామంలో కల్లుకు బానిస, గల్ఫ్ లో మతిస్థిమితం కోల్పోయాడు
గ్రామీణ పేదరికం, గల్ఫ్ బాట పట్టించింది
మానసిక అస్వస్థతతో అబుదాబిలో భిక్షాటన
సమస్యను సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసికెళ్లిన కుటుంబం
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం యూఏఈ రాజధాని అబుదాబి ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. గ్రామంలో చెడు అలవాట్లకు బానిసై దాన్నుంచి బయటపడాలని గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ దుర్భర జీవితాన్ని వెళ్ల దీస్తున్నాడు.
నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబికి వెళ్లిన శ్రీరాం, రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యాడు. నెల రోజుల అనంతరం అతడిని గుర్తించి క్యాంప్‌కు తీసుకువచ్చినా, కంపెనీ మానవత్వం మరిచి లోపలికి అనుమతించకుండా బయటకు తోసివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష వైఖరి కారణంగా అతడు మళ్లీ రోడ్ల పాలయ్యాడు.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ అతడిపై ‘అబ్‌స్కాండింగ్’ కేసు నమోదు చేసి, స్వదేశానికి పంపాలంటే 4,500 దిర్హముల (సుమారు రూ.1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి ప్రతులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు అందజేశారు.
మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు.
ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబి తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు.
“నా భర్తను తక్షణం స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో మానసిక వైద్యం, పునరావాసం కల్పించండి. అత్యంత పేద గిరిజన కుటుంబం. ఈ ఖర్చులు భరించే స్థితిలో లేము” అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయంకు లేఖ రాశారు.


