సిడ్నీ: ఆస్ట్రేలియాలో యూదు సమాజం లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆ దేశంలోని శాంతిభద్రతలను ప్రశ్నిస్తున్నాయి. సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, మెల్‌బోర్న్‌లో మరో విద్వేషపూరిత ఘటన వెలుగుచూసింది. హనుక్కా పండుగ గుర్తు ఉన్న ఒక కారుపై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఇంటి డ్రైవ్‌వేలో పార్క్ చేసి ఉన్న కారుపై జరిగిన ఈ దాడిని యూదు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి, గత రెండేళ్లుగా పెరుగుతున్న యూదు వ్యతిరేకతే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.
డిసెంబర్ 14న బాండీ బీచ్ సమీపంలోని యూదుల సమావేశంపై జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని ఒక్కసారిగా వణికించింది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ జరిపిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మందికి పైగా గాయపడ్డారు. 1996 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత భయంకరమైన కాల్పుల ఘటనగా దీనిని అధికారులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఈ తండ్రీకొడుకులు మారుమూల ప్రాంతాల్లో ముందస్తుగా తుపాకీ ప్రాక్టీస్ చేసినట్లు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ఈ విపత్కర పరిస్థితులపై ఆస్ట్రేలియన్ జ్యూయిష్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మత విద్వేషాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెల్‌బోర్న్ కారు దహనం వెనుక మతపరమైన కోణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, స్థానిక యూదు సమాజం మాత్రం తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూదు వ్యతిరేక సంక్షోభం ఆస్ట్రేలియాలో ఒక సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు.
కాగా ఈ దాడుల సమయంలో ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడిన వారిని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం ఒక కొత్త ‘జాతీయ ధైర్యసాహసాల అవార్డు’ను ప్రకటించారు. అసాధారణ ధైర్యం ప్రదర్శించిన పౌరులు, అత్యవసర సేవా సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుందని ఆయన తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి; ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక


