
ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు మరో షాక్ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఉపా చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద అతనిపై తాజాగా ఓ కేసు నమోదు చేసింది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పన్నూ చేసిన వీడియో ప్రకటనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
పంద్రాగస్టు సందర్భంగా.. ఎర్రకోటలో దేశ ప్రధాని జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వేడుకల్లో మోదీని జెండా ఎగరేయకుండా అడ్డుకున్న వాళ్లకు భారీ నజరానా ప్రకటించాడు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రధాన న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్‌ఐఏ.. UAPA (Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేసింది.
ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. సిక్కు సైనికుల్లో ఎవరైనా సరే ప్రధాని మోదీని జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని, అలా చేస్తే రూ.11 కోట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంతటి ఆగకుండా.. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి "కొత్త ఖలిస్తాన్" అనే పటాన్ని కూడా విడుదల చేశాడు.
ఈ చర్యలను భారత దేశ భద్రత, భౌగోళిక సమగ్రతను భంగపరిచే ప్రయత్నంగా భావిస్తూ.. ఎన్‌ఐఏ అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. సిక్కు సమాజంలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తీవ్ర వాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నాడని ఇదివరకే అతనిపై అభియోగాల కింద పలు కేసులు నమోదు అయ్యాయి.
సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.
ఇదీ చదవండి: బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యమంటున్న భీమవారం వాసి!