
జపాన్ రాజకీయాల్లో అత్యంత అరుదైన ఘట్టం ఈ శనివారం చోటు చేసుకోబోతోంది. కాబోయే ప్రధానిని(Japan Next PM) ఎన్నుకునేందుకు అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ శనివారం ఓటింగ్ నిర్వహించుకోనుంది. ప్రధాని రేసులో ఐదుగురు అభ్యర్థుల పేర్లు తెరపైకి రాగా.. సనాయే టకాయిచీ (64) మరియు షింజిరో కోఇజుమి (44) ప్రధానంగా పోటీలో ముందున్నారు.
2024 అక్టోబర్, 2025 జూన్, 2025 జూలైలో పార్లమెంట్ ఉభయ సభలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ వరుస పరాజయాలు చవిచూసింది. పార్టీ క్రమక్రమంగా మెజారిటీ కోల్పోవడం, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, పాత పాలనా విధానాలపై విమర్శల నేపథ్యంలో.. షిగెరూ ఇషిబా తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో పార్టీ కొత్త అధ్యక్షుడ్ని(ప్రధాని కూడా) ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. ఈ ఎన్నికతో జపాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. అయితే యువ ప్రధాని, లేదంటే తొలి మహిళా ప్రధాని రాబోయే రోజుల్లో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇతో హిరోబుమి 1885 డిసెంబర్ 22న జపాన్ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా మాజీ ప్రధాని ఇషిబాతో కలిపి 64 మంది ఆ దేశానికి ప్రధానులుగా చేశారు. అయితే పురుషాధిక్య రాజకీయాలతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ దేశానికి.. మహిళా ప్రధాని అవకాశం లేకుండా పోయింది. అయితే.. యూరికో కోయికె 2016లో టోక్యో గవర్నర్‌గా ఎన్నికై.. జాతీయ స్థాయిలో నాయకత్వం కోసం మహిళలు పోటీ చేసే అవకాశానికి తలుపులు తెరిచారు. ఇప్పుడు.. సనాయే టకాయిచీ ప్రధాని రేసులో నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
బలాబలాలు..
అనుభవం వర్సెస్ యువ రక్తంగా జపాన్ ఈ ఎన్నికను భావిస్తోంది. ఎందుకంటే.. టకాయిచీకి దివంగత మాజీ ప్రధాని షింజో అబే రాజకీయ వారసురాలిగా పేరుంది. ఆయన ఆశీస్సులతోనే 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఎల్డీపీ అధ్యక్ష పదవికిపోటీ చేశారామె. అయితే.. ఆ ఎన్నికల్లో పుషియో కిషిదా చేతిలో ఓడారామె. ఇక ఇప్పుడు.. ఆమె దూకుడు ఆర్థిక వ్యయం ప్రతిపాదనతో పీఎం రేసులో ప్రధానంగా నిలిచారు. పైగా ట్రంప్‌ను హ్యాండిల్ చేయడం ఈమె వల్లే సాధ్యం కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోందక్కడ.
ఇక.. జపాన్ రాజకీయాల్లో పాత తరపు నాయకత్వ శైలికి ప్రత్యామ్నాయం కావాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లే కోయిజుమి మితవాద పన్ను తగ్గింపు విధానాన్ని ముందుంచారు. ఇది జపాన్ ఆర్థిక దిశను మలుపు తిప్పే అంశం కావడంతో ఆసక్తి నెలకొంది.
ముందస్తు పోల్స్, అంచనాల ప్రకారం.. పోటీ తీవ్రంగానే ఉన్నా కోయిజుమీనే ఆధిక్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరగబోయే ఎన్నికల్లో.. తొలి రౌండ్‌లో గనుక ఫలితం లేకపోతే మరో రౌండ్‌కు వెళ్తారు.
తీవ్ర సంక్షోభం మధ్య..
జపాన్‌లో గత కొన్ని దశాబ్దాలుగా 1995 సిస్టమ్ అధికారం కొనసాగుతోంది. 1955లో స్థాపించబడిన ఎల్‌డీపీ(LDP) ఇప్పటికీ జపాన్ రాజకీయాలను శాసిస్తోంది. ఈ 70 ఏళ్ల కాలంలో.. 1993–1996(కూటమి ప్రభుత్వం), 2009–2012(డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ DPJ) మధ్య కాలాలను మినహాయిస్తే మిగతా ఏళ్లు ఎల్డీపీనే అధికారంలో కొనసాగింది. అయితే అనారోగ్య కారణాలతో షింజో అబే ప్రధాని పదవి నుంచి దిగిపోయాక.. ఆ పార్టీ పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ తరుణంలో కొత్త నాయకత్వం ద్వారా పార్టీని పునరుద్ధరించుకోవాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: మోదీ నా స్నేహితుడు.. ఆయన అలాంటి పని చేయబోరు!