breaking news
LDP
-
జపాన్‌కు మహిళా సారథ్యం
వరస కుంభకోణాలూ, పడిపోతున్న రేటింగ్‌లతో నలుగురు ప్రధానులు వచ్చినంత వేగంగానూ నిష్క్రమించిన జపాన్‌లో తొలిసారి మహిళా నాయకురాలు సనే తకాయిచిని మంగళవారం ఆ దేశ పార్లమెంటు ప్రధానిగా ఎన్నుకున్నది. సంప్రదాయ, జాతీయవాద లిబరల్ డెమాక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి చెందిన తకాయిచి రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలని వాదిస్తారు. కానీ విశ్వాసాల రీత్యా ఆమె ఫక్తు సంప్రదాయవాది. అదే ఆమెకు కలిసొచ్చింది. మొన్న జూలైలో ఎగువసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటానికి సంప్రదాయ ఓటర్లు అతి మితవాద పక్షం సన్సిటో పార్టీవైపు మొగ్గటం వల్లేనని ఎల్డీపీ లెక్కేసింది. అంతక్రితం నామమాత్రంగావుండే ఆ పార్టీ ఆ ఎన్నికల్లో 15 స్థానాలు గెల్చుకుంది. ఈ పరిస్థితుల్లో తకాయిచి వైపు పార్టీ మొగ్గుచూపింది. అందుకే ఈ నెల మొదట్లో పార్టీలో ఆమె నలుగురు పురుష అభ్యర్థులను అధిగమించి ప్రధాని పదవికి ఎంపిక కాగలిగారు. అన్ని దేశాల్లోనూ అతి మితవాద పక్షాలకు స్ఫూర్తినిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్‌లోనూ తన ప్రభావం చూపారు. సన్సిటో ఎదుగుదల ఆయన పుణ్యమే! ‘మేక్ జపాన్ గ్రేట్ అగైన్’ నినాదాన్ని సన్సిటో వల్లించటం యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ పైపై కారణాలు. కానీ ఇందులో ఎల్డీపీ స్వయంకృతమే అధికం. గత ఏడు దశాబ్దాల్లో దేశాన్ని అత్యధిక కాలం పాలించింది ఆ పార్టీయే. అందువల్ల చాలా సమస్యలకు మూలం అక్కడేవుంది. 2023లో బద్దలైన అక్రమ నిధుల వ్యవహారంలో ఎల్డీపీ తీవ్రంగా దెబ్బతింది. ఈ వ్యవహారంలో నాటి ప్రధాని కిషిదా నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకవలసి వచ్చింది. పర్యవసానంగా ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లో తొలిసారి అత్తెసరు మెజారిటీ వచ్చింది. అటుతర్వాత కూడా వరస ఎదురుదెబ్బలు తప్పటం లేదు. దానికితోడు ఏళ్లు గడుస్తున్నకొద్దీ రుణభారం పెరుగుతూపోతోంది. ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. సరుకుల కొరత జనాన్ని పీడిస్తోంది. వీటన్నిటి వల్లా మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇక ట్రంప్ సుంకాల బెదిరింపులు సరేసరి. వీటిని సరిచేసే మార్గం తోచక, జనంలో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని నివారించలేక చివరకు తకాయిచి ఎంపికే సరైందని పార్టీ నాయకులు భావించారు. అతి మితవాద పక్షం బలం పుంజుకుంటుంటే, తాము సైతం అదే పరిభాషలో మాట్లాడి జనాన్ని బోల్తా కొట్టించవచ్చని ఇతర పార్టీలు చాలా దేశాల్లో భ్రమపడుతున్నాయి. మితవాద భాష అలవాటు చేసుకున్న ఎల్డీపీ ఆ తరహా భ్రమల్లోనే ఉన్నట్టు కనబడుతోంది.తకాయిచి వల్ల తాత్కాలికంగా మార్కెట్లు కోలుకున్న మాట వాస్తవమే అయినా వివిధ అంశాలపై ఆమె వైఖరి పార్టీ కొంప ముంచుతుందని వాదిస్తున్నవారూ లేకపోలేదు. కావటానికి దేశ తొలి మహిళా ప్రధానేగానీ ఆమె నుంచి మహిళలు పెద్దగా ఆశించటానికేం లేదు. పితృస్వామ్య భావనలు బలంగా వేళ్లూనుకున్న సమాజంలో ఆమె తీరు ఈ తరం మహిళలకు మింగుడుపడటం లేదు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే చాలా... సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కోసం ఏమీ చేయలేరా అని కొందరు ప్రశ్నించటం అందుకే! పెళ్లయినంత మాత్రాన కన్నవారింటి పేరును మహిళలు ఎందుకు వదులుకోవాలని వాదించే వారితో ఆమె ఏకీభవించరు. పెళ్లయ్యాక ఏ మహిళైనా ‘ఆడ’ పిల్లేనని తకాయిచి అంటారు. కుటుంబ వారసత్వం మగవాళ్లకు దక్కటం న్యాయమేనని వాదిస్తారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు బద్ధ వ్యతిరేకి. అలాగే వలసలపైనా నిప్పులు కక్కుతారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని మాత్రం ఆమె డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ వచ్చే 2028 ఎన్నికలనాటికి ఎల్డీపీని తకాయిచి గట్టెక్కించటం మాట అటుంచి ఇప్పుడున్న అత్తెసరు మెజారిటీతో సుస్థిర పాలన అందించగలరా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. దిగువసభలో కావలసిన మెజారిటీ కన్నా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే అధికంగా సాధించిన తకాయిచికి విపక్షంలో ఉన్న అనైక్యత తోడ్పడింది. కానీ ఉభయసభల్లో తగిన మెజారిటీ కొరవడినందున ఏ చట్టం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విపక్షాలను అర్థించకతప్పదు. కనుక ప్రభుత్వాధినేతగా తకాయిచి బలహీనురాలు. అందువల్ల తాను ఎంతగానో అభిమానించే బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను అనుకరించాలని తకాయిచి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది! -
జపాన్ రాజకీయాల్లో పెనుసంచలనం!
జపాన్ రాజకీయాల్లో అత్యంత అరుదైన ఘట్టం ఈ శనివారం చోటు చేసుకోబోతోంది. కాబోయే ప్రధానిని(Japan Next PM) ఎన్నుకునేందుకు అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ శనివారం ఓటింగ్ నిర్వహించుకోనుంది. ప్రధాని రేసులో ఐదుగురు అభ్యర్థుల పేర్లు తెరపైకి రాగా.. సనాయే టకాయిచీ (64) మరియు షింజిరో కోఇజుమి (44) ప్రధానంగా పోటీలో ముందున్నారు.2024 అక్టోబర్, 2025 జూన్, 2025 జూలైలో పార్లమెంట్ ఉభయ సభలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ వరుస పరాజయాలు చవిచూసింది. పార్టీ క్రమక్రమంగా మెజారిటీ కోల్పోవడం, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, పాత పాలనా విధానాలపై విమర్శల నేపథ్యంలో.. షిగెరూ ఇషిబా తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో పార్టీ కొత్త అధ్యక్షుడ్ని(ప్రధాని కూడా) ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. ఈ ఎన్నికతో జపాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. అయితే యువ ప్రధాని, లేదంటే తొలి మహిళా ప్రధాని రాబోయే రోజుల్లో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతో హిరోబుమి 1885 డిసెంబర్ 22న జపాన్ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా మాజీ ప్రధాని ఇషిబాతో కలిపి 64 మంది ఆ దేశానికి ప్రధానులుగా చేశారు. అయితే పురుషాధిక్య రాజకీయాలతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ దేశానికి.. మహిళా ప్రధాని అవకాశం లేకుండా పోయింది. అయితే.. యూరికో కోయికె 2016లో టోక్యో గవర్నర్‌గా ఎన్నికై.. జాతీయ స్థాయిలో నాయకత్వం కోసం మహిళలు పోటీ చేసే అవకాశానికి తలుపులు తెరిచారు. ఇప్పుడు.. సనాయే టకాయిచీ ప్రధాని రేసులో నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. బలాబలాలు.. అనుభవం వర్సెస్ యువ రక్తంగా జపాన్ ఈ ఎన్నికను భావిస్తోంది. ఎందుకంటే.. టకాయిచీకి దివంగత మాజీ ప్రధాని షింజో అబే రాజకీయ వారసురాలిగా పేరుంది. ఆయన ఆశీస్సులతోనే 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఎల్డీపీ అధ్యక్ష పదవికిపోటీ చేశారామె. అయితే.. ఆ ఎన్నికల్లో పుషియో కిషిదా చేతిలో ఓడారామె. ఇక ఇప్పుడు.. ఆమె దూకుడు ఆర్థిక వ్యయం ప్రతిపాదనతో పీఎం రేసులో ప్రధానంగా నిలిచారు. పైగా ట్రంప్‌ను హ్యాండిల్ చేయడం ఈమె వల్లే సాధ్యం కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోందక్కడ.ఇక.. జపాన్ రాజకీయాల్లో పాత తరపు నాయకత్వ శైలికి ప్రత్యామ్నాయం కావాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లే కోయిజుమి మితవాద పన్ను తగ్గింపు విధానాన్ని ముందుంచారు. ఇది జపాన్ ఆర్థిక దిశను మలుపు తిప్పే అంశం కావడంతో ఆసక్తి నెలకొంది.ముందస్తు పోల్స్, అంచనాల ప్రకారం.. పోటీ తీవ్రంగానే ఉన్నా కోయిజుమీనే ఆధిక్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరగబోయే ఎన్నికల్లో.. తొలి రౌండ్లో గనుక ఫలితం లేకపోతే మరో రౌండ్‌కు వెళ్తారు. తీవ్ర సంక్షోభం మధ్య.. జపాన్‌లో గత కొన్ని దశాబ్దాలుగా 1995 సిస్టమ్ అధికారం కొనసాగుతోంది. 1955లో స్థాపించబడిన ఎల్డీపీ(LDP) ఇప్పటికీ జపాన్ రాజకీయాలను శాసిస్తోంది. ఈ 70 ఏళ్ల కాలంలో.. 1993–1996(కూటమి ప్రభుత్వం), 2009–2012(డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ DPJ) మధ్య కాలాలను మినహాయిస్తే మిగతా ఏళ్లు ఎల్డీపీనే అధికారంలో కొనసాగింది. అయితే అనారోగ్య కారణాలతో షింజో అబే ప్రధాని పదవి నుంచి దిగిపోయాక.. ఆ పార్టీ పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ తరుణంలో కొత్త నాయకత్వం ద్వారా పార్టీని పునరుద్ధరించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: మోదీ నా స్నేహితుడు.. ఆయన అలాంటి పని చేయబోరు! -
కిషిదా వారసుడెవరో!
జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ప్రతి మూడేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ప్రధాని ఫుమియో కిషిదా 2021లో ఎల్డీపీ నేతగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూడు పర్యాయాలు పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాదరణ తక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని కిషిదా తాను మరోమారు ప్రధాని పదవికి పోటీపడటం లేదని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అక్టోబర్ ఒకటిన కిషిదా, ఆయన కేబినెట్ రాజీనామా చేయనుంది. అదేరోజు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కిషిదా ని్రష్కమణ నేపథ్యంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వానికి తీవ్ర పోటీ నెలకొంది. శుక్రవారం జరిగే ఎన్నికలో ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుత కేబినెట్ మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రులు. దిగువసభ కాలావధి 2025 అక్టోబర్ వరకు ఉన్నప్పటికీ.. కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ కొత్త ఇమేజ్ను ఉపయోగించుకొని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ప్రధాని పదవి చేపట్టాక కొద్ది వారాల్లోనే ఎన్నికలకు వెళతామని చాలా మంది పోటీదారులు బాçహాటంగానే చెప్పారు. ఓటింగ్ జరిగేదిలా.. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఎల్డీపీకి 368 మంది ఎంపీల బలముంది. ఎంపీకి ఒక ఓటు ఉంటుంది. 11 లక్షల ఎల్డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీపడుతున్న అభ్యర్థులకు కేటాయిస్తారు. అంటే తొలిరౌండ్లో మొత్తం 736 ఓట్లు ఉంటాయి. మొదటిరౌండ్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉండటంతో తొలిరౌండ్లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారమే రెండో రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. మొదటిరౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు తదుపరి రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటింగ్‌కు అర్హులు. మొత్తం 415 ఓట్లు ఉంటాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గుచూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు వేస్తారు. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కిషిదా కుర్చీ కోసం తొమ్మిది మంది రేసులో నిలిచినా.. ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెబుతున్నాయి. మాజీ రక్షణమంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్‌జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నారు. యోషిమాసా హయాíÙ, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి, యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో.. మిగతా పోటీదారులు. టాప్–3 పోటీదారుల వివరాలిలా ఉన్నాయి...షిగెరూ ఇషిబా (67): ఆపత్కాలంలో అనుభవజు్ఞడు ఇషిబా మాజీ బ్యాంకర్. ఎల్డీపీ నాయకత్వానికి ఆయన పోటీపడటం ఇది ఐదోసారి. ఇదే తన చివరి ప్రయత్నమని ప్రకటించారు. 1986లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన ఇషిబా రక్షణ, వ్యవసాయ శాఖలతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూశారు. పార్టీ పదవుల్లోనూ పనిచేశారు. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ.. తోటి ఎంపీల నుంచి ఆశించినంత మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష కాన్సిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ మాజీ ప్రధాని యోషిహికో నోడాను తమ నాయకుడిగా ఎన్నుకుంది. వాగ్ధా్దటితో ప్రజలను ఆకట్టుకునే నోడాను ఎదుర్కొనడానికి ఇషిబా అనుభవం, విషయ పరిజ్ఞానం, నైపుణ్యం అక్కరకొస్తాయని ఎల్డీపీ భావిస్తోంది. రక్షణ విధానాల రూపకల్పనలో నిపుణుడిగా ఇషిబాకు పేరుంది. నాటో రక్షణ కూటమి లాంటిది ఆసియాకూ ఉండాలని ఇషిబా ప్రతిపాదించారు. షిన్‌జిరో కొయిజుమీ (43): నాలుగోతరం వారసుడు ప్రజాదరణ పొందిన మాజీ ప్రధాని జునిచితో కొయిజుమీ కుమారుడే షిన్‌జిరో. కొయిజుమీ రాజకీయ వారసత్వంలో నాలుగోతరం నాయకుడు. శుక్రవారం ఎన్నికల్లో నెగ్గితే జపాన్‌కు అత్యంత పిన్న వయసు్కడైన ప్రధానిగా రికార్డులకెక్కుతారు. 2009లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. షింజో అబే కేబినెట్లో 2019– 2021 మధ్య పర్యావరణ మంత్రిగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో మాస్టర్స్ చేసిన షిన్‌జిరో ప్రముఖ టీవీ యాంకర్ తకిగవా క్రిస్టెల్ను వివాహమాడారు. ఇతర పోటీదారులతో పోలి్చనపుడు అనుభవం పెద్దగా లేకున్నా.. ఎల్డీపీ శ్రేణుల్లో ఆదరణ ఉంది. మాజీ ప్రధాని యోషిహిడే సుగా మద్దతు ఉంది. సంస్కరణ వాది. పితృత్వపు సెలవును ప్రమోట్ చేయడానికి 2020లో స్వయంగా రెండు వారాలు సెలవు తీసుకున్నారు. జపాన్– అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని, పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో కలిసి పనిచేస్తానని షిన్‌జిరో చెబుతారు. రెండోరౌండ్ వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అనుభవలేమి ఒక్కటే ప్రతికూలత.తకైచీ సనయీ (63): సంప్రదాయవాది తకైచీ గెలిస్తే జపాన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రి అవుతారు. మాజీ ప్రధాని షింజో అబే అనుయాయురాలు. సంప్రదాయవాది. రైట్ వింగ్ మద్దతు ఉంది. 2021లో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వం కోసం కిషిదాతో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సా«ధనసంపత్తిని బలోపేతం చేయడం, ఆహార భద్రత, సైనిక సామర్థ్యం పెంపుదల, పంపిణీ వ్యవస్థల బలోపేతం.. ఇవి తకైచీ ప్రధాన హామీలు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తారు. పురుషులనే వారసులుగా పరిగణించే రాజకుటుంబ సంప్రదాయాన్ని బలపరుస్తారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన తకైచీ తొలిసారిగా 1993లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిగా పనిచేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు రోల్ మోడల్ అని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్