
వరస కుంభకోణాలూ, పడిపోతున్న రేటింగ్‌లతో నలుగురు ప్రధానులు వచ్చినంత వేగంగానూ నిష్క్రమించిన జపాన్‌లో తొలిసారి మహిళా నాయకురాలు సనే తకాయిచిని మంగళవారం ఆ దేశ పార్లమెంటు ప్రధానిగా ఎన్నుకున్నది. సంప్రదాయ, జాతీయవాద లిబరల్ డెమాక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి చెందిన తకాయిచి రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలని వాదిస్తారు. కానీ విశ్వాసాల రీత్యా ఆమె ఫక్తు సంప్రదాయవాది. అదే ఆమెకు కలిసొచ్చింది. మొన్న జూలైలో ఎగువసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటానికి సంప్రదాయ ఓటర్లు అతి మితవాద పక్షం సన్సిటో పార్టీవైపు మొగ్గటం వల్లేనని ఎల్‌డీపీ లెక్కేసింది.
అంతక్రితం నామమాత్రంగావుండే ఆ పార్టీ ఆ ఎన్నికల్లో 15 స్థానాలు గెల్చుకుంది. ఈ పరిస్థితుల్లో తకాయిచి వైపు పార్టీ మొగ్గుచూపింది. అందుకే ఈ నెల మొదట్లో పార్టీలో ఆమె నలుగురు పురుష అభ్యర్థులను అధిగమించి ప్రధాని పదవికి ఎంపిక కాగలిగారు. అన్ని దేశాల్లోనూ అతి మితవాద పక్షాలకు స్ఫూర్తినిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్‌లోనూ తన ప్రభావం చూపారు. సన్సిటో ఎదుగుదల ఆయన పుణ్యమే! ‘మేక్ జపాన్ గ్రేట్ అగైన్’ నినాదాన్ని సన్సిటో వల్లించటం యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ పైపై కారణాలు. కానీ ఇందులో ఎల్‌డీపీ స్వయంకృతమే అధికం.
గత ఏడు దశాబ్దాల్లో దేశాన్ని అత్యధిక కాలం పాలించింది ఆ పార్టీయే. అందువల్ల చాలా సమస్యలకు మూలం అక్కడేవుంది. 2023లో బద్దలైన అక్రమ నిధుల వ్యవహారంలో ఎల్‌డీపీ తీవ్రంగా దెబ్బతింది. ఈ వ్యవహారంలో నాటి ప్రధాని కిషిదా నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకవలసి వచ్చింది. పర్యవసానంగా ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లో తొలిసారి అత్తెసరు మెజారిటీ వచ్చింది. అటుతర్వాత కూడా వరస ఎదురుదెబ్బలు తప్పటం లేదు. దానికితోడు ఏళ్లు గడుస్తున్నకొద్దీ రుణభారం పెరుగుతూపోతోంది. ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. సరుకుల కొరత జనాన్ని పీడిస్తోంది.
వీటన్నిటి వల్లా మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇక ట్రంప్ సుంకాల బెదిరింపులు సరేసరి. వీటిని సరిచేసే మార్గం తోచక, జనంలో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని నివారించలేక చివరకు తకాయిచి ఎంపికే సరైందని పార్టీ నాయకులు భావించారు. అతి మితవాద పక్షం బలం పుంజుకుంటుంటే, తాము సైతం అదే పరిభాషలో మాట్లాడి జనాన్ని బోల్తా కొట్టించవచ్చని ఇతర పార్టీలు చాలా దేశాల్లో భ్రమపడుతున్నాయి. మితవాద భాష అలవాటు చేసుకున్న ఎల్‌డీపీ ఆ తరహా భ్రమల్లోనే ఉన్నట్టు కనబడుతోంది.
తకాయిచి వల్ల తాత్కాలికంగా మార్కెట్లు కోలుకున్న మాట వాస్తవమే అయినా వివిధ అంశాలపై ఆమె వైఖరి పార్టీ కొంప ముంచుతుందని వాదిస్తున్నవారూ లేకపోలేదు. కావటానికి దేశ తొలి మహిళా ప్రధానేగానీ ఆమె నుంచి మహిళలు పెద్దగా ఆశించటానికేం లేదు. పితృస్వామ్య భావనలు బలంగా వేళ్లూనుకున్న సమాజంలో ఆమె తీరు ఈ తరం మహిళలకు మింగుడుపడటం లేదు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే చాలా... సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కోసం ఏమీ చేయలేరా అని కొందరు ప్రశ్నించటం అందుకే!
పెళ్లయినంత మాత్రాన కన్నవారింటి పేరును మహిళలు ఎందుకు వదులుకోవాలని వాదించే వారితో ఆమె ఏకీభవించరు. పెళ్లయ్యాక ఏ మహిళైనా ‘ఆడ’ పిల్లేనని తకాయిచి అంటారు. కుటుంబ వారసత్వం మగవాళ్లకు దక్కటం న్యాయమేనని వాదిస్తారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు బద్ధ వ్యతిరేకి. అలాగే వలసలపైనా నిప్పులు కక్కుతారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని మాత్రం ఆమె డిమాండ్ చేస్తూ వచ్చారు.
కానీ వచ్చే 2028 ఎన్నికలనాటికి ఎల్‌డీపీని తకాయిచి గట్టెక్కించటం మాట అటుంచి ఇప్పుడున్న అత్తెసరు మెజారిటీతో సుస్థిర పాలన అందించగలరా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. దిగువసభలో కావలసిన మెజారిటీ కన్నా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే అధికంగా సాధించిన తకాయిచికి విపక్షంలో ఉన్న అనైక్యత తోడ్పడింది.
కానీ ఉభయసభల్లో తగిన మెజారిటీ కొరవడినందున ఏ చట్టం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విపక్షాలను అర్థించకతప్పదు. కనుక ప్రభుత్వాధినేతగా తకాయిచి బలహీనురాలు. అందువల్ల తాను ఎంతగానో అభిమానించే బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను అనుకరించాలని తకాయిచి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది!