ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి జరిగింది. వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్‌పై దుండగులు దాడి చేశారు. దుండగులు.. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన దాముద్యాలోని క్యూర్‌బంగా బజార్‌లో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. కాగా, గడిచిన రెండు వారాల్లో నలుగురు హిందువులపై దాడి జరగడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తన భర్త హత్యపై దాస్ భార్య సీమా దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత సీమా దాస్ మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ పోసి తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. తమకు ఏ విషయంలోనూ ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన భర్తపై ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. మేము హిందువులం. ఇక్కడ శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం. నా భర్తపై దాడి చేసిన వారిని ప్రభుత్వం శిక్షించాలి. దాడి చేసిన వారిలో ఇద్దరిని నా భర్త గుర్తించారు. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించారు. నేను ప్రభుత్వాన్ని సాయం కోసం అభ్యర్థిస్తున్నాను అని కన్నీటిపర్యంతమయ్యారు.
Bangladesh - Seema Das wife of Khokon Das said in Bangla & broke down - We have no dispute with anyone on any issue. We don't understand why my husband was suddenly targeted. He recognised 2 of the attackers, That's why they poured petrol on his head, face & set him on fire. pic.twitter.com/A8atvPubYl
— Anand L (@kharshad0) January 1, 2026
ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్ యూనియన్‌లోని తిలాయ్ గ్రామానికి చెందిన ఖోకన్ దాస్.. క్యూర్‌బంగా బజార్‌లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తారు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్‌బంగా బజార్‌కు సమీపంలో దుండగులు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. గాయపడిన దాస్ తలపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
దుండగుల నుంచి తప్పించుకోవడానికి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దాస్ దూకేశారు. ఈలోగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుడిని షరియత్‌పుర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనుక భాగంలో, చేతులపై తీవ్ర గాయాలున్నాయని వైద్యులు తెలిపారు.


