
కరూర్ ర్యాలీలో జన సందోహం, (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న విజయ్
విశ్లేషణ
తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఓ కూడలి వద్ద సెప్టెంబర్ 27 రాత్రి సంభవించిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయ పడిన జనం పదుల సంఖ్యలో ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు అయిన విజయ్ ర్యాలీకి 27,000 మందికి పైగా హాజరైనపుడు ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఆయన రాక ఏడు గంటలు ఆలస్యమై, సభ రాత్రి 7.30 గంటలకు మొదలైంది. అప్పటి వరకు విజయ్ కోసం ఉత్సుకతతో వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామక్కల్‌లో సభ ముగించుకుని కరూర్ వచ్చేందుకు విజయ్‌కి అన్ని గంటల సమయం ఎందుకు పట్టిందని కొందరు అంటున్నారు.
పోలీసులు కేటాయించిన స్థలమే!
విజయ్ కరూర్ సభకు ఎంతమంది తరలిరాగలరో అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారా... అన్నది సహజంగానే ఇక్కడ తలెత్తే ప్రశ్న. రాజకీయంగా తనను ఎదగనీయకుండా చేసేందుకు పోలీసులు అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయ్ చేస్తున్న ఆరోపణలతో తమిళనాడు పోలీసులు గత కొద్ది నెలలుగా ఆత్మరక్షణ ధోరణిని అనుసరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం తిరుచిరాపల్లిలో విజయ్ రోడ్ షో నిర్వహించినపుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
దాంతో సభా నిర్వహణ కోసం కరూర్‌లో విజయ్ ఎంచుకున్న రెండు ప్రదేశాలకు పోలీసులు అను మతి నిరాకరించారు. అవి జన సమ్మర్ధంతో కిటకిటలాడే వాణిజ్య స్థలాలు కావడమే అందుకు కారణం. అందుకే ఆ రెండూ కాకుండా, కొద్ది రోజుల క్రితం అన్నా డి.ఎం.కె నాయకుడు ఎళప్పాడి పళని స్వామి సభ నిర్వహించిన కరూర్‌లోని మరో ప్రదేశాన్ని పోలీసులు విజయ్ సభకు కేటాయించారు. టీవీకే మొదట ఎంచుకున్న ఆ సభా ప్రాంతాలు రెండింటికీ ఇది కూడా దగ్గరలోదే కావడంతో పార్టీ అందుకు వెంటనే అంగీకరించింది.
ఏర్పాట్లలో తడబడుతున్న టీవీకే
కాగా, తాజా ఘటన రాజకీయంగా, సంస్థాగతంగా టీవీకేకు కొరవడిన సామర్థ్యాన్ని బహిర్గతం చేసింది. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్. ఆనంద్ ఒక్కరే టీవీకేలో రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన గతంలో వివిధ కాంగ్రెస్ చీలిక వర్గాలలో పనిచేశారు. ఇటువంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా జిల్లా కార్యదర్శులు ముఖ్యపాత్ర వహిస్తారు. వారు సాధారణంగా అట్ట డుగు స్థాయి సంబంధాలు కలిగినవారై ఉంటారు. అయితే టీవీకేలో విజయ్ అభిమాన సంఘాలలోని ప్రీతిపాత్రులే ఆ భూమిక నిర్వ హిస్తున్నారు. సభలకు తగిన ఏర్పాట్లు చేయడంలో వారు తడబడు తున్నారు.
తమ సభలకు సుమారు పది వేల మంది హాజరు కావచ్చని అంచనా వేస్తున్నట్లు వారు పోలీసులకు చెబుతున్న సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఇలాంటి సభలప్పుడు సాధారణంగా పార్టీలు కొద్దిమంది కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసి ఆహారం, నీరు సమకూర్చే ఏర్పాట్లు చేస్తూంటాయి. కాగా, సభలకు హాజరైన జనాన్ని అదుపులో ఉంచి, నియంత్రించవలసిన అవస రాన్ని ఇప్పటికే అనేక తమిళ పార్టీలు గుర్తించాయి కూడా! రాజీవ్ గాంధీ హత్యోదంతంతో తమిళనాడు ఈ చేదు పాఠాన్ని నేర్చు కోవాల్సి వచ్చింది. టీవీకే తన తరహాలో నిర్వహిస్తున్న రోడ్ షోల లాంటివి మాత్రం తమిళనాడు రాజకీయాలకు కొత్త.
అప్పటి ‘సినీ–నాయకులు’ వేరు!
గతంలో జయలలిత, కరుణానిధి కూడా వాహనాలలో రాష్ట్ర హైవేలలో ప్రయాణించినా ముందుగా నిర్ణయించిన చోట్ల మాత్రమే వారు వాహనాలను ఆపి ప్రసంగించేవారు. కొద్ది వేల మందిని ఉద్దే శించి ప్రసంగించి మరో చోటుకు బయలుదేరేవారు. పైగా, వారు జనాలు వేచి చూసేటట్లు చేసేవారు కాదు. నిర్హేతుకమైన జాప్యాలకు అవకాశమిచ్చేవారు కాదు. మొన్నటి ఘటనలో అంబులెన్సుల రాకకు సంబంధించిన శబ్దాలు వినిపిస్తున్నా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా ఆయన రాజకీయ అనుభవ రాహి త్యాన్ని సూచించింది.
ఏం జరుగుతోందో ఎవరూ ఆయన చెవిన వేసినట్లు లేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరుచిరాపల్లిలో ప్రైవేటు విమానం ఎక్కి, రెండు గంటల్లోపల చెన్నైకి చేరుకున్నారు. ఆయనతో పాటే టీవీకే సభ్యులు కూడా సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. పోలీసుల ఎఫ్.ఐ.ఆర్‌కు ఎక్కిన కొందరు పరారీలో ఉన్నారు.
‘‘కక్ష ఉంటే నాపై తీర్చుకోండి!’’
ఈ అవకాశాన్ని అధికార డి.ఎం.కె పార్టీ సద్వినియోగం చేసుకు న్నట్లే కనిపిస్తోంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన సెంథిల్ బాలాజీ ఆ సమయంలో నియోజకవర్గంలోనే ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. అయితే సెంథిల్ బాలాజీ ఆస్పత్రికి చేరుకోక ముందే, కరూర్ మాజీ ఎమ్మెల్యే అన్నా డి.ఎం.కె నాయకుడు ఎం.ఆర్. విజయ్ భాస్కర్ బాధితులను పరామర్శించటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా శనివారం అర్ధరాత్రికల్లా కరూర్ చేరు కున్నారు.
స్టాలిన్ కుమారుడు, ఆయన వారసత్వాన్ని అందుకుంటాడని భావిస్తున్న ఉదయనిధి కూడా ఆదివారం ఉదయానికల్లా కరూర్‌లో వాలారు. అయితే విజయ్‌కి మాత్రం ఈ ఘటనపై క్షమా పణ కోరుతూ బహిరంగ ప్రకటన చేయడానికి 12 గంటలకు పైగా పట్టింది. ఇక, తాజాగా నిన్న (సెప్టెంబరు 30) విడుదల చేసిన ఒక వీడియోలో, ‘‘నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించ లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైపోయింది. మాటలు రావటం లేదు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి. నా అభిమా నులపై కాదు’’ అని కూడా విజయ్ ఆ వీడియోలో అన్నారు. వచ్చే ఏడాది (2026) ఎన్నికలకు సమాయత్తమవుతున్న విజయ్‌కి ఈ సంఘటన పెను విఘాతమేనని చెప్పాలి. ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో ఏకసభ్య విచారణ సంఘాన్ని నియమించ డాన్ని టీవీకే, అన్నా డి.ఎం.కెలు తోసిపుచ్చాయి. సి.బి.ఐతో దర్యాప్తు జరిపించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.
హీరో... నాయకుడిగా మారాలి
ఎం.జి. రామచంద్రన్, జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే అయినా, ఎమ్జీఆర్‌కు ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. జయలలిత చాలా ఆటుపోట్లను తట్టుకుని ఎంజీఆర్ చెంత రాజకీయంగా సుశిక్షితురాలిగా మారారు. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయనకు లక్షల మంది అభిమానులున్నమాట నిజమే. అయితే ప్రజలు ఓటు వేయాలని కోరుకునే రాజకీయ నాయకునిగా ఆయన రూపాంతరం చెందాల్సి ఉంది. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి తిరిగి ఎప్పుడు బయలుదేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భవిష్యత్ పరిణామాలు వెండితెరపై కాక, రాజకీయ యవనికపైనే ఆవిష్కృతం కానున్నాయి.
నిరుపమా సుబ్రమణియన్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్