సందర్భం
ఒక దేశం గడిచిపోయిన సంవత్సరాన్ని వెనుకకు తిరిగి సమీక్షించుకోవట మంటే, ఆ సంవత్సరంలోని పరిణామాలను తారీఖులు, దస్తావేజుల పద్ధతిలో నెమరు వేసుకోవటం కాదు. అంతకుముందటి సంవత్సరంతో పోల్చినప్పుడు ఏమైనా మెరుగుపడిందా అని సరిచూసుకోవటం. రాజకీయంగా, పరిపాలనాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, వాటితో పాటు బయటి దేశాలతో సంబంధాల రీత్యా! వీటికి సంబంధించిన అంశాలు అన్నింటికి అన్నీ మెరుగుపడి ఉండకపోవచ్చు. అది సాధ్యం కూడా కాదు. కొన్ని ఒడుదొడుకులు తప్పవు. కానీ, మొత్తం మీద సారాంశం ఏమిటన్న దానిని బట్టే ఒక దేశం ముందుకు పోవటం ఆధారపడి ఉంటుంది.
పైన పేర్కొన్న అయిదు ప్రధాన రంగాలకు సంబంధించి, గడిచిపోయిన 2025వ సంవత్సరంలో అనేకానేకం జరిగాయి. వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రం పేర్కొని ఆ ప్రభావాలను అంచనా వేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యమైనవి అనే మాటను ముందు నిర్వచించుకోవాలి. కొన్నింటికి తక్షణ ప్రాముఖ్యం ఉండి క్రమంగా తేలిపోతాయి. కొన్నింటికి తదనంతర కాలంలోనూ ప్రభావాలు కొనసాగుతాయి. ఇక్కడ చూసేందుకు ప్రయత్నిస్తున్నది ఈ రెండో తరహా వాటి గురించి.
బలపడిన బీజేపీ
ముందుగా రాజకీయాలను గమనిస్తే, 2025వ సంవత్సరం వచ్చే వేళకు దేశం ముందుండిన ప్రధానమైన ప్రశ్న, 2024లో వరుసగా కేంద్రంలో, రాష్ట్రాలలో పరాజయాల పాలైన ప్రతిపక్షాలు ఇప్పటికైనా కూడదీసుకోగలవా అన్నది. కాంగ్రెస్‌ను, దాని నాయకత్వాన గల యూపీఏను 2014లో వెనుకకు తోసిన బీజేపీ, క్రమంగా ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపరుస్తున్న క్రమం 2025లో, ఆ తర్వాత 2026లో ఆగగలదా? కాంగ్రెస్, దాని కూటమి పార్టీలు కలిసి 2027 కల్లా పుంజుకుని బీజేపీకి నిజమైన సవాలుగా నిలవగలవా అన్నది పెద్ద ప్రశ్న అయింది.
అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరిగిన ఢిల్లీ, బిహార్, 2026లో జరగనున్న అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కలిపి మొత్తం ఆరు రాష్ట్రాలు. వీటిలో ప్రతిపక్ష రాష్ట్రం ఢిల్లీని బీజేపీ ఇప్పటికే గెలుచుకోగా, ప్రతిపక్షం ఎన్నో ఆశలు పెట్టు కున్న బిహార్, అంతకుముందటి కన్న భారీ ఆధిక్య తతో బీజేపీ వశమైంది. 2026లో జరిగే అస్సాంపై ప్రతిపక్షాలకు, కేరళపై బీజేపీకి అంచనాలు లేక పోవచ్చు గానీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు కోసం ఆ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తున్నది. 2025 చివరన నికరంగా కనిపిస్తున్నదేమంటే, బీజేపీ 2024 కన్న ఇప్పుడు మరింత బలపడి, 2026లో ఇంకా బలపడే సూచనలు కనిపిస్తుండగా, ప్రతిపక్షాల పరిస్థితి అందుకు విరుద్ధ దిశలో సాగుతున్నది.
ఆర్థికం యథాతథం
దేశం ఆర్థికంగా 2025లో మెరుగుపడిందా, క్షీణించిందా అన్న ప్రశ్నపై తీవ్రమైన చర్చలు సాగు తున్నాయి. అవి స్థూలంగా చూసినపుడు ఉత్తర – దక్షిణ ధ్రువాలన్నంత భిన్నంగా ఉన్నాయి. వాస్తవా నికి ఆర్థిక రంగం 2024తో పోల్చినప్పుడు కొద్దిపాటి తేడాలతో యథావిధిగానే సాగుతున్నది తప్ప భారీ మార్పులంటూ కనిపించవు. ఉత్పాదక రంగం, వాణిజ్యం, ఆదాయాలు, ధనిక పేద తారతమ్యాల పెరుగుదల, అదే సమయంలో మధ్యతరగతి పెరుగు దల, అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆర్థిక – వాణిజ్య సవాళ్లు, రూపాయి విలువ ఆగకుండా పతనమవుతుండటం, వాణిజ్య లోటు పెరుగుతూనే ఉండటం, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగు దల, వ్యవసాయ రంగ సమస్యలు అన్నింటిదీ 2024 నాటి పరిస్థితే. అదే సమయంలో మరొకవైపు, పలు విధాలైన సక్రమ, అక్రమ రాయితీలతో కొందరి సంపదలు కొండలవలె పెరగటం కూడా 2025లో కొనసాగింది. మరొకవైపు వివిధ అంతర్జాతీయ సూచీలలో ఎందులోనూ భారతదేశపు ర్యాంకింగులు మెరుగుపడలేదు.
ఆర్థిక రంగానికి సంబంధించి 2025వ సంవత్సరపు రెండు గమనార్హమైన విషయాలున్నాయి. ఒకటి – అమెరికా విధించిన భారీ సుంకాలు, ఇండియాను లొంగదీసేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వాణిజ్య ఒప్పందం. రెండవది – అమెరికా ఒత్తిడిని సరకు చేయకుండా భారత ప్రభుత్వం ‘బ్రిక్స్’లో కొనసాగుతూ ఆ వ్యవస్థను శక్తిమంతం చేస్తుండటం. ఇవిగాక, అమెరికా కూటమి నుంచి వైవిధ్యంకోసం పలు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని మోదీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధమైన పరిస్థితులు, పరిణామాలు 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయం నుంచి ఇదే మొదటిసారి. 2025లో ఎదురైన ఈ సవాళ్ల వంటివి లోగడ లేవు. వీటిని సానుకూలంగా ఎదుర్కొనగలగటంపై వర్తమానంతోపాటు దీర్ఘకాలిక భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది.
దెబ్బతిన్న సంబంధాలు
బయటి ప్రపంచంతో ఆర్థిక సంబంధాల పరిస్థితి ఇది కాగా, రాజకీయ సంబంధాలు మాత్రం సంతోషకరంగా సాగలేదు. పాకిస్తాన్‌తో యుద్ధం, బంగ్లాదేశ్‌తో సంబంధాల క్షీణత, శ్రీలంకతో సత్సంబంధాల కోసం పడుతున్న శ్రమ ఇందుకు తార్కాణం. చైనా, రష్యాలకు, ఇండియాకు మధ్య సంబంధాల అభివృద్ధి ముఖ్యంగా అమెరికా తీరు కారణంగా ముగ్గురికీ అవసరమనే గుర్తింపు గతంలో కన్న ఎక్కువగా ఏర్పడటం, అందుకు తగిన వ్యవహరణ అన్నది 2025లో కనిపించిన కొత్త విశేషం. చివరగా సమాజం విషయానికి వస్తే, యథాతథంగానే పెరుగుతున్న ఆర్థిక అసంతృప్తికి తోడు, ఒకవైపు అల్పసంఖ్యాక వర్గాలు, మరొకవైపు దళితుల భద్రత 2024 కన్న స్పష్టమైన రీతిలో మరింత క్షీణించింది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


