బిహార్‌ ఎన్నికలు... ఎన్నెన్నో ప్రశ్నలు! | Sakshi Guest Column On Bihar Assembly Elections | Sakshi
Sakshi News home page

బిహార్‌ ఎన్నికలు... ఎన్నెన్నో ప్రశ్నలు!

Published Wed, Apr 23 2025 12:37 AM | Last Updated on Wed, Apr 23 2025 8:40 AM

Sakshi Guest Column On Bihar Assembly Elections

విశ్లేషణ

బిహార్‌ రాష్ట్రం 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలనీ; వలసలు నియంత్రించాలనే డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బిహార్‌ రాష్ట్రానికి పెద్ద పీట వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల వరకు ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ (యూ)దే పైచేయిగా ఉండేది. కానీ, ఐదేళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు దశాబ్దాలుగా జేడీ(యూ) ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను, దళితులను తన వైపు తిప్పుకుంది. 

నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో, పరిపాలనా సంస్కరణలతో లబ్ధిపొందిన ఈ వర్గాలను ఆకర్షించడం ద్వారా... బీజేపీ తన ‘సామాజిక’ కూటమిని బలోపేతం చేసుకుంది. సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్‌ జన్‌ శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీ తమ గుర్తింపును కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడు తున్న క్రమంలో బీజేపీకి సానుకూలంగా మారింది. 

వివిధ కుల సమూహాలను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తోంది. పలు సందర్భాల్లో జేడీ(యూ)తో విభేదాలొ చ్చినా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన హిందూత్వ భావ జాలాన్ని బిహార్‌ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది. హిందూ సంఘటితం చుట్టే రాజకీయాలు నడు పుతూ మొట్టమొదటిసారి ఈ ఎజెండాతోనే ఎన్నికలు నడిచేలా వ్యూహాలను రచిస్తోంది. 

బడుగు, బలహీన వర్గాల ఐక్యతను కాపాడాలనే సిద్ధాంతంతో పని చేస్తున్న ‘ఇండియా’ కూటమికి ఇది అతిపెద్ద సవాలుగా మారబోతోంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. అలాగే ఆ పార్టీ వ్యూహాత్మ కంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యత ఈసారి బిహార్‌ ఎన్నికలను రసవత్తరంగా మార్చనున్నది. 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్‌ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా; ఆర్జేడీ,కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహాగఠ్‌బంధన్‌ (ఎంజీబీ) కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి.

ఈ ఓట్ల వ్యత్యాసం ఇకముందు కూడా కొనసాగితే ఎన్డీఏ 2025లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ 2020 తర్వాత వికాసషీల్‌  ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) మహాVýæఠ్‌బంధన్‌లో చేరడం, జేడీ (యూ)లో రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ విలీనం కావడంతో ఈసారి లెక్కలు మారవచ్చు.

బిహార్‌లో 18 శాతం ఉన్న ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారు. 2020లో ఎంజీబీకి 76 శాతం ముస్లిం ఓట్లు రాగా, ఎన్డీఏకు కేవలం 5 శాతమే వచ్చాయి. యాదవ్‌– ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే బీజేపీ వైపు ఉన్న బీసీలను, దళితులను తనవైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు ఎన్డీఏ–ఎంజీబీ కూటముల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) జన్‌ సూరజ్‌ పార్టీ నుంచి ఎంజీబీకి ముప్పు పొంచి ఉంది. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ, అటు జేడీ(యూ) ఓట్లను గణనీయంగా చీల్చవచ్చు. ఆయన ఆర్జేడీ, జేడీ(యూ) పార్టీలపైనే విమర్శలతో విరుచుకుపడుతుండటంతో బీజేపీకి పరోక్షంగా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీ యాలు కాకుండా అభివృద్ధి తరహా రాజకీయాలు చేస్తా నని పీకే చెప్తున్నారు. 

లాలూ, నితీష్‌ల వృద్ధాప్యం, పాశ్వాన్‌ మరణంతో ఏర్పడిన ఖాళీని తాను భర్తీ చేయా లనుకుంటున్నారు. అయితే 243 నియోజకవర్గాల్లో నిల బెట్టడానికి బలమైన, నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు. కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత ఐ.పి. గుప్తా ‘ఇండియన్‌ ఇంక్విలాబ్‌ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎస్‌ అధికారిగా బిహార్‌లో ప్రత్యేక పనితీరు కనబర్చిన మహా రాష్ట్రకు చెందిన శివ్‌దీప్‌ లాండె ‘హింద్‌ సేన’ పార్టీ ఏర్పాటు చేశారు. 

ఒకప్పుడు నితీష్‌కు సన్నిహి తునిగా ఉన్న ఆర్‌సీపీ సింగ్‌ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ – జేడీ(యూ) మళ్లీ పొత్తు పెట్టుకో వడంతో ఈయన ‘ఆప్‌ సబ్‌కీ ఆవాజ్‌’ పార్టీని నెలకొల్పారు. కుర్మీ సామాజిక నేత అయిన ఆర్పీ సింగ్‌ ఆ సామాజిక ఓట్లు చీల్చే అవకా శాలున్నాయి. ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్‌ అభ్యర్థుల గెలుపోటములను శాసించ నున్నాయి.

ఆర్జేడీ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బీజేపీకి పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఓబీసీలను ఏకం చేయాలనీ, మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే ఈబీసీలను, దళితులను ఎన్డీయే శిబిరం నుంచి తమ వైపు తిప్పుకోవాలనీ ఎంజీబీ లక్ష్యాలుగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇది. మరో ఏడు నెలల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే!


ఆర్‌. దిలీప్‌ రెడ్డి 
వ్యాసకర్త పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement