సాక్షి, సిద్ధిపేట: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు. తెలంగాణ తుపానులో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఏపీని తప్పుపట్టడం లేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్.. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా? లేక అవివేకా? అని ప్రశ్నించారు.
..మిత్రపక్షానికి బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నాను. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి. స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడటం దురదృష్టకరం. ఏపీలో తుఫాను వస్తే మా హుస్నాబాద్ మునిగింది.. మేము ఏపీ ప్రజలను తప్పు పట్టడం లేదు. అది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తున్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం. వెంటనే పవన్ తన మాటలు ఉప సంహరించుకోవాలి.. క్షమాపణలు కోరాలి. భవిష్యత్తులో ఇలాంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడవద్దు.. విజ్ఞతగా వ్యవహరించాలి. ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. ఏపీ, తెలంగాణ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలి.. ఇలాంటి వ్యాఖ్యలు మాకు రావు.. మీరు మాట్లాడకూడదు అని హితవు పలికారు.
తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు..
తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ను తప్పుపట్టడం లేదు..
ఎక్కడో కోనసీమ లో కొబ్బరి… pic.twitter.com/CEI7fldwq6— Ponnam Prabhakar (@Ponnam_INC) December 2, 2025


