
అంబేడ్కర్ జయంతికి కేంద్ర మంత్రులు అంబేడ్కర్‌పై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఒకరు దీన్ని కాంగ్రెస్ విమర్శకు వాడుకుంటే, మరొకరు అంబేడ్కర్ నోట అబద్ధాలు కుక్కారు. వీటిని ఆదర్శాల పేరుతో భావితరాలకు బోధిస్తారట. ఆర్య దండ యాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారనీ, సంస్కృతాన్ని అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా రాజ్యాంగ సభలో సవరణను ప్రవేశపెట్టారనీ. హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారనీ ఇలా ఎన్నో అవాస్తవాలను రాశారు వారు.
‘‘ఇండో–ఆర్యులు ఇండియాకు వలస వచ్చి స్వదేశీయులను తరిమేశారు. వలస వాద, బ్రాహ్మణవాద కథనాలు కులాధిపత్య సమర్థనలు. ఆర్యులు సాంస్కృతిక భాషా సమూహం, ప్రత్యేక జాతి కాదు. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాల్లోని విభేదాలు సామాజిక అంత ర్గత పోరాటాల ప్రతిబింబాలు. ఆర్య దండయాత్ర సూత్రం ఆర్యేతర శూద్రుల, దళితుల అణచివేత సాధనం.’’ అని రాశారు అంబేడ్కర్. ఆర్య సూత్ర జాతి సంస్కృతుల ఊహలను సవాలు చేశారు. యజుర్, అధర్వణ వేదాల రుషులు శూద్రు లకు తగిన ప్రాధాన్యమిచ్చినట్లు అంబేడ్కర్ అనలేదు. ‘‘శూద్రులు ముందు ఆర్య క్షత్రియుల్లో భాగం. జనశ్రుతి (శూద్రుడు) వైదికజ్ఞాన అభ్యాసం, కవశ ఐలూశ (శూద్రుడు) శ్లోకాల రచన సంగతులు ఈ వేదాల్లో ఉన్నాయి.
వేదాలు శూద్రుల జాతి, సామాజిక హీనతను సమర్థించ లేదు. మనుస్మృతి ఆ పని చేసింది. బ్రాహ్మణ, ప్రత్యేకించి ఉపనయన, ఆచారాల విభేదాలతో వారిని నాల్గవ వర్ణానికి దిగజార్చారు. శూద్రుల ఉన్నత స్థాయి తగ్గింపునకు వేదకాలం తర్వాతి బ్రాహ్మణ నీతి ఇది’’ అని అన్నారు. అంబేడ్కర్ శూద్రులతో పోల్చి ఆర్యులను పొగడలేదు. ఆర్య ఉన్నత జాతి సూత్రీ కరణను తిరస్కరించారు. ద్రవిడ, నాగ, దాస తెగలు అనార్యుల్లో భాగమని, వారు ఆర్యు లకు ఏ విధంగానూ తక్కువ కారని అంబేడ్కర్ అభిప్రాయం. అంబేడ్కర్ అధి కార భాషగా సంస్కృతానికి మద్దతివ్వలేదు. సంస్కృతాన్ని ప్రజలు అతి తక్కువగా వాడు తారని, పాలనకు, ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి సంస్కృతం ఆచరణీయం కాదనేది ఆయన అభిప్రాయం. హిందీని రుద్దడం హిందీయేతర భాషా ప్రాంతాల అణచివేతకుదారి తీయగల అపాయాన్ని జాగ్రత్తగా పరిగణించాలన్నారు. ఆంగ్లంతో పాటు హిందీ భారత ప్రజల లంకె భాషగా ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాదించారు. మరిఅంబేడ్కర్ ఆదర్శాలను సంఘ్ సర్కారు ఆచరిస్తుందా?
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి,
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి