
ఈ సవాళ్లు కొత్త దారులు తెరుస్తాయి!
భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను శాసించాలి. అధిక నాణ్యత, తక్కువ ధరే మన బలం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై విధించిన ట్యారిఫ్‌లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ పిలుపునిచ్చారని వేరే చెప్పాల్సిన అవ సరం లేదు. ఏ దేశమైనా వేరే దేశం నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటుందంటే అర్థం అవి దానికి అవసరమనే కదా! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహ రిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా సుంకాలను విధిస్తున్నారు. అమెరికాకు భారత్ ఎగు మతి చేసే వస్తువులు, సేవల మొత్తం సుమారు 87 బిలియన్ డాలర్లు. ఇది భారత్ మొత్తం ఎగుమతులలో 18% వాటా. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 90–100 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవల ఎగుమతి ఉండవచ్చనేది విశ్లేషకుల అంచనా.
సుంకాల వల్ల ఈ ఎగుమతులన్నీ ఆగిపోతాయా అంటే కాదనే చెప్పవచ్చు. భారత్ అతి తక్కువ ధరలకు, నాణ్యమైన వస్తువుల్ని సరఫరాచేస్తోంది. ఉదాహరణకు ఫార్మాస్యూటికల్ రంగం దాదాపు 8 బిలి యన్ డాలర్ల విలువైన పేటెంట్ లేని ఔషధ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాక పోతే అక్కడి ప్రజలే ఇబ్బంది పడతారు. అలాగని పూర్తిగా మనకు ఇబ్బంది ఉండదా అంటే... ట్యారిఫ్‌ల వల్ల అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు. ఆ ప్రభావం మన మీద పడుతుంది.
ఇదీచదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు
భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పైపైకి ఎగబాకుతుండటాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ఇప్పటివరకూ ఇండో – పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాలు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ తన చర్యల ద్వారా స్వీయ ముద్ర వేస్తోంది. తైవాన్‌తో వాణిజ్య ఒప్పందం, ఫిలిప్పీన్స్‌తో మిసైల్స్ సరఫరా ఒప్పందం, జపాన్‌తో టెక్నాలజీ సరఫరాకుసంబంధించిన ఒడంబడిక, వియత్నాంతో సైనిక సహకారం, ఇండో నేషియాతో సముద్ర భద్రత వంటి వాటిపై ఒప్పందాలు కుదుర్చు కుంది. అంతటితో ఆగడం లేదు. రష్యా ప్రతిపాదించిన రష్యా–ఇండియా–చైనా (ఆర్‌ఐసీ) ప్రతిపాదన మరోసారి తెరమీదికివచ్చింది. ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి పూర్తిగా గండికొట్టేయ వచ్చు.
నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్‌పై కాదు. అమెరికా ప్రజలపై! 2025లో అన్ని సుంకాల వల్ల సగటు అమెరికా కుటుంబానికి సంవత్సరానికి 3,800 డాలర్ల నష్టం ఏర్పడుతుందని అంటున్నారు. ట్రంప్ లాంటి వాళ్లు ట్యారిఫ్‌లు ఎంత ఎక్కువ వేసినా భారత్‌కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది. కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికీ, భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించడానికీ అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ట్రంప్ ట్యారిఫ్‌లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి.
చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?
-ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు