
విలువైన వస్తువు అనగానే బంగారం, ప్లాటినం, డైమండ్లు, వెండి తదితరాలు గుర్తుకొస్తాయి. బంగారం, డైమండ్లను మించి ఖరీదు చేసే చెట్టు ఒకటి ఉంది అదేంటో తెలుసా? ఖరీదైన చెట్టు అనగానే చందనమో, ఎర్రచందనం అనుకునేరు.. వాటికంటే ఎంతో విలువైన కలప గురించి తెలుసుకుందాం పదండి.
పుత్తడి రేటు ఆకాశాన్నంటి అందనంత దూరంలో ఊరిస్తోంది. అలాంటి కోవలోదే ఇది కూడా చాలా ఖరీదైన అరుదైన కలప. పేరు అగర్‌వుడ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపలలో ఒకటి. దీన్నేఅగర్వుడ్, అలోస్వుడ్ లేదా ఈగిల్వుడ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పెర్ఫ్యూమ్ పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ సహజంగా దీని తయారీ ప్రక్రియకు 15-20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ కలప చాలా అరుదైనదీ, ఖరీదైనదిగా పేరుగాంచింది. ఇది ఆసియాలోని అక్విలేరియా చెట్ల నుండి వస్తుంది. ఈ చెట్లు ఫంగస్ బారిన పడినప్పుడు రెసిన్ (జిగురు లాంటి పదార్థం)ను ఉత్పత్తి చేస్తాయి. ఇలా సేకరించిన నూనెను లగ్జరీ పెర్ఫ్యూమ్‌లలో ఉపయోగిస్తారు. దీనికి అనేక ఔషధ ఉపయోగాలు కూడా మెండుగా ఉన్నాయని చెబుతారు. దీని ధర కిలోకు రూ. కోటి రూపాయలకు మాటే. ఒక గ్రాము ధర లక్ష రూపాయలు పలుకుతుంది.
హిమాలయాల నుండి ఆగ్నేయాసియాలోని పాపువా న్యూ గినియా వరకు విస్తరించి ఉన్న భౌగోళిక ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ ఆక్విలారియా చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి. ఈ చెట్టులోని రెసిన్ ఒక శిలీంధ్ర సంక్రమణ ద్వారా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియకు అంటే రెసిన్ నిర్మాణం చాలా నెమ్మదిగా ఉంటుంది. సుమారు 10 నుండి 20 సంవత్సరాలు పడుతుంది. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ అవి ఒక నిర్దిష్ట రకమైన ఫంగస్ ద్వారా సంక్రమించినప్పుడు, అవి తమను తాము రక్షించుకోవడానికి ముదురు, సువాసనగల రెసిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాలక్రమేణా, ఈ రెసిన్ కలపగుండా వ్యాపించి, దానిని అగర్‌వుడ్‌గా మారుస్తుంది. మరో విషయం ఏమిటంటే ఇది ప్రతి చెట్టుకు జరగదు. చాలా తక్కువ చెట్లలో మాత్రమే ఇలా జరుగుతుంది.
అగర్వుడ్ దాని సువాసనకు మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. సాంస్కృతిక ,ఆధ్యాత్మిక విలువ కూడా ఉంది. శతాబ్దాలుగా, ఆసియా , మధ్యప్రాచ్యం అంతటా ప్రజలు దీనిని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ,ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. దీని సువాసన గాలిని శుభ్రపరుస్తుందని, మనస్సుకు విశ్రాంతి నిస్తుందని, ధ్యానం లేదా ప్రార్థనకు సహాయపడుతుందని నమ్ముతారు. ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అరబ్ దేశాలలో, వివాహాలు, మతపరమైన ఆచారాలు, రాజవంశాల సంప్రదాయంలో దీని పెర్ఫ్యూమ్ విస్తృతంగా ఉపయోగిస్తారు. భారతదేశం, మలేషియా, థాయిలాండ్, లావోస్ , ఇండోనేషియాలో అగర్వుడ్ చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే దాని పరిరక్షణ ఒక పెద్ద సవాలు అనడంలో సందేహం లేదు. చెట్లను చట్టవిరుద్ధంగా నరికివేయడం వలన, ఈ చెట్లు పతనం అంచున ఉన్నాయి. దీని కారణంగా, ప్రభుత్వం , పర్యావరణ సంస్థలు దీన్ని రక్షించేందుకు ప్రత్యేక ప్రచారాలను అమలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు