
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కొనసాగుతోంది. రష్యా చమురును కొనడం ఆపకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ఇండియాకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా చైనాపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని.. అందుకే ఎక్కువ టారిఫ్‌లు చెల్లిస్తోందని వెటకారంగా మాట్లాడారాయన. ఈ క్రమంలో.. భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికల జారీ చేశారు.
తాజాగా అమెరికా ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్ డాలర్ల ‘అరుదైన ఖనిజాల’ ఒప్పందం(Rare Minerals Agreement) చేసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వైట్‌హౌజ్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న టైంలో.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా-అమెరికా ఈ ఇరు దేశాలు అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని, అలా జరగని పక్షంలో చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
చైనాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని భావిస్తున్నా. ఈ ఒప్పందం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మంచిదై ఉంటుంది. చైనా అమెరికా పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతం 55% టారిఫ్‌ల రూపంలో భారీగా డబ్బు చెల్లిస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 1న ఒప్పందం కుదరకపోతే టారిఫ్‌లు 155%కి పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు(Trump Warn China).
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 31వ తేదీ నుంచి దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సమావేశం జరగనుంది. అయితే.. దీనికంటే ముందే అక్టోబర్ 29, 30 తేదీలలో ట్రంప్ అక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. తనకు చైనా అధ్యక్షుడికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనన ట్రంప్.. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. చైనా ప్రపంచంలో అరుదైన ఖనిజాల (Rare Earth Materials) ప్రధాన సరఫరాదారు. వీటి సాయంతోనే స్మార్ట్‌ఫోన్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాల తయారు అవుతుంటాయి. అయితే.. చైనా ఈ ఎగుమతులపై నియంత్రణలు పెంచింది. దీంతో అమెరికా సహా ఇతర దేశాలకు ఈ ఖనిజాలు అందుబాటులో ఉండటం కష్టతరమయ్యే చాన్స్ ఉంది. అందుకే ట్రంప్ చైనాతో మంచి వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన నెతన్యాహు!