
ఉక్కు కంటే 10 రెట్లు పటిష్టమైంది
రసాయన చర్యతో సృష్టించిన పరిశోధకులు
వాషింగ్టన్: ఉక్కు కంటే ఏకంగా 10 రెట్లు పటిష్టమైన చెక్కను అమెరికా శాస్త్రవేత్తల బృందం విజయ వంతంగా సృష్టించింది. దీనికి సూపర్‌వుడ్(Superwood) అని పేరుపెట్టింది. సాధారణ కలపనే రసాయన చర్యకు గురిచేసి అత్యంత పటిష్టమైన, కఠిన కలపగా రూపాంతరం చెందించారు. మౌలిక వసతుల రంగంలో నాణ్యమైన, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే మన్నికైన కలపకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్‌ను తలదన్నేలా కలపను సృష్టించి అమెరికా శాస్త్రవేత్తలు ఔరా అనిపించారు. ఈ బృందానికి ప్రఖ్యాత మెటీరియల్ సైన్స్ నిపుణుడు లియాంగ్‌బింగ్ హూ సారథ్యం వహించారు.
ఈ పరిశోధన ఫలితాలు ప్రఖ్యాత ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చెట్టు కలపకు పటిష్టతను, రంగును ఇచ్చే లింగ్నిన్ అనే పదార్థాన్ని కలప నుంచి తొలగించి ఆ చెక్కకు చెక్కుచెదరని పటిష్టతను ఆయన ఆపాదించగలిగారు. ఇందుకోసం హూ బృందం వినూత్నమైన పద్ధతిని అవలంభించింది. సహజ కలప చెక్క నుంచి లింగ్నిన్, హెమీ సెల్యూలోజ్‌లను తొలగించేందుకు ఆ చెక్కలను తొలుత సోడియం హైడ్రాక్సైడ్, సోడియా సల్ఫేట్ ద్రావకంలో ఉడకబెట్టారు. తర్వాత అదే వేడిమీద చెక్కలను సమతల పరికరంతో గట్టిగా అదిమారు.
దీంతో కలపలోని కణాల సవ్యఅమరిక ధ్వంసమై అన్నీ ఒక్కదగ్గరకు చేరిపోయాయి. దీంతో సెల్యూలోజ్ నానోకణాలు చిక్కగా ఒకే దగ్గరకు చేరి కలప ఉక్కులాగా గట్టిపడింది. ఇది ఏకంగా స్టీల్ కంటే 10 రెట్లు గట్టిగా ఉన్నట్లు పలు పరీక్షల్లో నిర్ధారణ అయింది. తేమను తట్టుకుంటూ సులువుగా విరిగిపోకుండా చెక్క మరింత దృఢత్వాన్ని సంతరించుకుంది. ఈ చెక్క బరువు సైతం సాధారణ చెక్క బరువులో ఆరోవంతే ఉండటం విశేషం. తక్కువ బరువు ఉండటంతో భూకంపాల వంటి సందర్భాల్లో ఈ చెక్కతో నిర్మించిన ఇళ్లు అంత త్వరగా కంపనాలకు గురికావు.
అత్యంత తేలికగా ఉండటంతో నిర్మాణంలో ఉపయోగించడం సైతం చాలా సులువు. ఇల్లు, కార్యాలయాల ఫర్నిచర్, ఇంటీరియల్ పనుల్లో రెండు సాధారణ చెక్కలు నట్లు, బోల్ట్‌లతో జతచేసినప్పుడు అవి త్వరగా పాడవుతుంటాయి. ఈ సమస్యకు ఈ కొత్తతరహా కలపతో చెక్ పెట్టొచ్చని కంపెనీ చెబుతోంది. సూపర్‌వుడ్ పేరిట ఈ చెక్కను అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఫ్రెడెరిక్ ప్రాంతంలో వాణిజ్యపరంగా తయారుచేయనున్నారు. హూ సహ వ్యవస్థాపకునిగా ఉన్న ఇన్వెంట్‌వుడ్ అనే సంస్థ ఈ కలపను తయారుచేయనుంది.
సాధారణ కలప కంటే 20 రెట్లు శక్తివంతం
లియాంగ్‌బింగ్ హూ పదేళ్ల క్రితమే ఇలా పటిష్టమైన చెక్క కోసం ప్రయోగాలు మొదలెట్టారు. ‘‘భూమిపై అత్యధికంగా లభ్యమయ్యే సహజ పాలిమర్‌గా సెల్యూలోజ్‌ను చెప్పొచ్చు. ఇది కలపలో మెండుగా ఉంటుంది. దీని సాయంతో ఉక్కులాంటి చెక్కను తయారు చేయాలని గతంలోనే భావించా. 2017లోనే ఈ తరహా ప్రయోగం చేశా. ఇన్నాళ్లకు వాణిజ్యపర ఉత్పత్తికి సిద్దమయ్యాం’’ అని హూ చెప్పారు.