మళ్లీ ట్రంప్‌ టారిఫ్‌ బాంబు | Trump sets 10percent tariff on lumber imports, 25percent on cabinets and furniture | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్రంప్‌ టారిఫ్‌ బాంబు

Oct 1 2025 5:50 AM | Updated on Oct 1 2025 5:50 AM

Trump sets 10percent tariff on lumber imports, 25percent on cabinets and furniture

కలపపై 10 శాతం, ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలు 

ఈ నెల 14 నుంచే అమల్లోకి...

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌ల మోత మోగిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే కలప(టింబర్‌)పై 10 శాతం, ఫర్నిచర్‌తోపాటు కిచెన్‌ కేబినెట్లపై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సుంకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్‌ ఆదేశాల పట్ల అమెరికాలో భవన నిర్మాణ రంగంపై మరింత భారం పడడం ఖాయమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఇళ్ల నిర్మాణం ఖరీదైన వ్యవహారంగా మారుతుందని అంటున్నారు. అమెరికాలో నిర్మాణ వ్యయం ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. 

స్థానిక పరిశ్రమల కోసమే 
అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకో వడంతోపాటు స్థానిక కలప పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే విదేశీ కలప, ఫర్నిచర్‌పై సుంకాలు విధించినట్లు ట్రంప్‌ స్పష్టంచేశారు. స్థానిక పరిశ్రమలకు ఊతం ఇస్తే కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుందని, తద్వారా తమ యువతకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దిగుమతులు తగ్గించుకోవడంతోపాటు అమెరికా నుంచి కలప, ఫర్నిచర్‌ ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ అవసరాలకు సరిపోయే చెట్లు, కలప అమెరికాలో ఉన్నాయని స్పష్టంచేశారు. అమెరికాకు ప్రధానంగా పొరుగుదేశం కెనడా నుంచి కలప దిగుమతి అవుతుంది. ట్రంప్‌ తాజా నిర్ణయంతో కెనడాకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement