
రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఉక్రెయిన్‌కు ఈ ఆయుధాలు అందాలని రష్యా కోరుకోదని వ్యాఖ్య
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపకుంటే తాము ఉక్రెయిన్‌కు అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులైన తొమహాక్‌లు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్‌కు వెళ్తూ తన విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘ఈ యుద్ధానికి ముగింపు పలకకుంటే నేను వారికి (ఉక్రెయిన్) తొమహాక్‌లు అందజేస్తాను.
తొమహాక్‌లు చాలా ప్రత్యేకమైనవి, శక్తిమంతమైనవి, ప్రభావవంతమైనవి. నిజంగా చెప్తున్నా ఉక్రెయిన్ చేతికి ఇలాంటి ఆయుధాలు అందటం రష్యాకు అస్సలు మంచిది కాదు. ఉక్రెయిన్‌కు తొమహాక్‌లు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, యుద్ధాన్ని ముగించేందుకు అదే సరైన పని. ఇలాంటి పరిస్థితి రావాలని రష్యా కోరుకోదనే అనుకుంటున్నా. ఈ అంశంపై నేను రష్యాతోనూ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు’అని ట్రంప్ పేర్కొన్నారు.
ఆదివారం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందజేసేందుకు సిద్ధమని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై కీలకమైన ఆయుధాలు వాడకుండా రష్యాపై కూడా తాను ఒత్తిడి తీసుకురాగలనని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందిస్తే రష్యా– అమెరికా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని పుతిన్ ఇటీవలే హెచ్చరించారు.
ఏమిటి తొమహాక్‌ల ప్రత్యేకత?
తొమహాక్ క్షిపణుల పూర్తిపేరు బీజీఎం–109 తొమహాక్ లాండ్ అటాక్ మిసైల్స్ (టీఎల్‌ఏఎం). ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా లక్ష్యాన్ని అత్యంత కచి్చతత్వంతో ధ్వంసం చేయగలవు. జెట్ ఇంజన్ శక్తిగత ఈ సబ్‌సోనిక్ క్యూయిజ్ క్షిపణులను ప్రస్తుతం అమెరికా నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలు వాడుతున్నాయి. వీటిని యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ల ద్వారా ప్రయోగిస్తారు. జాన్‌హాప్‌కిన్స్ యూనివర్సిటీలోని అప్లయిడ్ ఫిజిక్స్ లే»ొరేటరీ వీటిని అభివృద్ధి చేసింది.
1970 దశకంలో వీటిని జనరల్ డైనమిక్స్ మొదట ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత కాలానుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వీటితో బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు. యుద్ధనౌకలతోపాటు భూమిపై ఉండే లక్ష్యాలను కూడా ధ్వంసం చేయవచ్చు. ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు రూ.18 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో వివిధ రకాలున్నాయి. టీఎల్‌ఏఎం బ్లాక్ 2 క్షిపణి రేంజ్ 2,500 కిలోమీటర్లు. బ్లాక్ 3 రేంజ్ 1,300 కిలోమీటర్లు. సబ్‌మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణుల రేంజ్ వేరుగా ఉంటుంది. ఇవి శత్రు రాడార్లను ఏమార్చి దాడులు చేయగలవు.